- రాష్ట్ర వాటా రూ.75 కోట్లు మంజూరు
హైదరాబాద్, వెలుగు: డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్(డ్రిప్) కింద తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.100 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్, జూరాల, మూసీ, కౌలాస్నాలా, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల రిపేర్లను చేపట్టనుంది. వాస్తవానికి డ్రిప్ఫేజ్–1లో గత ప్రభుత్వం చేరలేదు. 2021లోనే ప్రతిపాదనలు వచ్చినా ముందుకెళ్లలేదు. అయితే, నిరుడు అక్టోబర్8న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీంలో చేరింది.
డ్రిప్ ఫేజ్–2లో ప్రపంచ బ్యాంకు నిధులను పొందేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవానికి ప్రాజెక్టుల రిపేర్లకు రూ.545 కోట్ల మేర ఖర్చు కానుంది. ఈ మొత్తంలో రాష్ట్ర వాటా 30 శాతం, ప్రపంచ బ్యాంక్వాటా 70 శాతంగా ఉంటుంది.
ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.381.5 కోట్లు రావాల్సి ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్ కోసం రూ.75 కోట్లు కేటాయించింది. అటు రావాల్సిన నిధుల్లో నుంచి రూ.100 కోట్లకు ప్రపంచ బ్యాంక్ఓకే చెప్పింది. అయితే, వరల్డ్ బ్యాంక్ చేస్తున్న ఆర్థికసాయం కూడా రుణమే కావడం గమనార్హం. 6.4 శాతం వడ్డీతో డ్రిప్ కింద ఈ రుణం ఇస్తోంది.
మూసీ పార్ట్–ఏకు వరల్డ్ బ్యాంక్ ఓకే..
మూసీ ప్రాజెక్ట్ పార్ట్–ఏ పనులకు ప్రపంచ బ్యాంకు నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే టెండర్లను పిలిచి పనులు చేపట్టేందుకు లైన్ క్లియర్అయింది. కాగా, వరల్డ్ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కలిపి రూ.175 కోట్లు ఉండగా.. శ్రీరాంసాగర్, మూసీ, జూరాల, కౌలాస్నాలా, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల రిపేర్లకు రూ.120.90 కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రిపేర్లు చేయాల్సిన ఈ ప్రాజెక్టులను డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్(డీఎస్ఆర్పీ) పరిశీలించింది. వాటి స్క్రీనింగ్టెంప్లేట్స్ను సిద్ధం చేసింది.
