
1970లలో అమెరికా గోల్డ్ స్ట్రాండర్డ్స్ పాటించటం మానేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఎంత డబ్బును ముద్రించవచ్చనే పరిమితులు లేకుండా పోయాయి. దీనికి ముందు దేశాల వద్ద ఉన్న బంగారానికి అనుగుణంగా సెంట్రల్ బ్యాంకులు డబ్బు ముద్రించేవి. కానీ ప్రస్తుతం దేశాలు కావాల్సినంత డబ్బు ముద్రించుకుంటూ ఆర్థిక వ్యవస్థల్లోకి ద్రవ్యోల్బణం, అప్పులను పెంచేస్తున్నాయి. ఇది పరోక్షంగా ప్రజలపై అప్పుల భారం పెరగటంతో పాటు వారి జీవనం ఖరీదైనదిగా మారిపోయేలా చేస్తోంది.
ప్రతి దేశానికీ ప్రస్తుతం అప్పులు ఉన్నాయి. అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దేశాలకు ఉన్న మెుత్తం అప్పు 300 ట్రిలియన్ డాలర్లు భారత కరెన్సీ లెక్కల ప్రకారం రూ.25వేల లక్షల కోట్ల కంటే ఇది ఎక్కువ. కానీ గ్లోబల్ ఎకానమీ విలువ దీనిలో మూడోవంతే ఉన్నప్పటికీ అప్పులు మాత్రం పాపం పెరిగినట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. అమెరికా, చైనా, ఇండియా, యూరప్ సహా మరిన్ని దేశాలు ప్రస్తుతం ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అయితే అసలు ఈ అప్పు ఎవరు ఎవరికి చెల్లించాలి అనే అనుమానం మనందరిలో సహజంగానే ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను గమనిస్తే..
అమెరికా అప్పులు 36 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా.. అందులో 750 బిలియన్ డాలర్లు చైనాకు చెల్లించాల్సిన మెుత్తం. ఇదే క్రమంలో చైనాకి కూడా 18 ట్రిలియన్ డాలర్ల వరకు అప్పు ఉంది. ప్రపంచ దేశాలు తమ ఆర్థిక అభివృద్ధితో పాటు దేశాభివృద్ధి కోసం బాండ్స్ ఇష్యూ చేయటం ద్వారా ఈ అప్పులను ప్రజలకు, బ్యాంకులకు, విదేశీ సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులు, విదేశీ ప్రభుత్వాలకు అమ్ముతుంటాయి. పైగా అమెరికా మెుత్తం అప్పుల్లో 70 శాతం ఆ దేశం తన ప్రజలకే చెల్లించాల్సిన మెుత్తంగా తెలుస్తోంది. ఇలా అభివృద్ధి సంక్షేమం కోసం చేసే అప్పులు, ఆ అప్పులు చెల్లింపుల కోసం మరిన్ని అప్పులు చేసుకుంటూ ప్రభుత్వాలా కొండంత అప్పుల్లో కూరుకుపోయాయి.
మరో పక్క కష్టాల్లో ఉన్న శ్రీలంక, పాకిస్థాన్ లాంటి దేశాలు ఇలాంటి విదేశీ అప్పుల ఊబిలో ఎప్పుడో కూరుకుపోయాయి. ఈ పరిస్థితులతో ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు పెరిగిపోతూ డబ్బున్నోళ్లు స్టాక్స్, బాండ్స్ అంటూ పెట్టుబడి పెడుతూ ముందుకు పోతుంటే మధ్యతరగతి ప్రభుత్వాలు చేసే అప్పుల వల్ల వారి దేశాల్లో పెరిగే ద్రవ్యోల్బణం వల్ల అధిక రేట్ల దెబ్బకు పేదరికంలోకి నెట్టబడుతున్నట్లు వెల్లడైంది. ఇలాంటి సమయంలోనే తెలివైన చాలా మంది తమ సంపదను బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో ఇన్వెస్ట్ చేసి కష్టసమయంలో వాటిని లిక్విడేట్ చేసుకుంటూ సంపద విలువను కాపాడుకుంటున్నారు. ఈ అప్పులకు ఎక్కడా అంతం కనిపించటం లేదని నిపుణులు అంటున్నారు.