పాక్ మ్యాచ్‌కు భద్రత కల్పించలేం.. బీసీసీఐకి CAB లేఖ!

పాక్ మ్యాచ్‌కు భద్రత కల్పించలేం.. బీసీసీఐకి CAB లేఖ!

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడే మ్యాచ్ తేదీలపై సందిగ్ధత వీడటం లేదు. డేట్‌లు మార్చాలంటూ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లు ఒక్కొక్కటిగా బీసీసీఐకి లేఖలు పంపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే భారత్-పాక్ మ్యాచ్‌‌ తొలుత ప్రకటించిన షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 14నే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 12న జరగాల్సిన పాక్-శ్రీలంక మ్యాచ్‌‌‌ను రెండు రోజులు ముందుగానే జరగనున్నట్లు సమాచారం. ఇవి రెండు కాకుండా తాజాగా మరో మ్యాచ్‍ డేట్ కూడా మారనున్నట్లు సమాచారం.

బీసీసీఐకి క్యాబ్‌ లేఖ

వరల్డ్‌కప్‌ షెడ్యూల్ ప్రకారం.. నవంబర్‌ 12న కోల్‌కతా వేదికగా పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ తో తలపడాల్సిందే. అయితే అదే రోజు కాళీ పూజ జరగనుండటంతో, ఆ రోజు పాక్‌ మ్యాచ్‌ నిర్వహిస్తే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని రాష్ట్ర పోలీసులు బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు (క్యాబ్‌) లేఖ రాసినట్లు ప్రచారం జరగుతోంది. 

పశ్చిమ బెంగాల్‍లో కాళీ పూజను ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత వైభవంగా జరుగుతుంది. దీంతో కాళీ పూజకు భారీ స్థాయిలో బందోబస్తు అవసరం ఉంటుంది. దీంతో అదే రోజు పాక్-ఇంగ్లండ్ మ్యాచ్ నిర్వహిస్తే పోలీసుల భద్రత తగినంత ఇవ్వలేమని కోల్‍కతా పోలీసు విభాగం.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను క్యాబ్‌ అధ్యక్షుడు స్నేహశిష్‌ గంగూలీ కొట్టిపారేశారు. కోల్‌కతా పోలీసుల నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని తెలిపిన ఆయన.. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే పరిశీలిస్తామని వెల్లడించారు.

ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ మ్యాచ్‌ల షెడ్యూల్

అక్టోబర్ 6: పాకిస్థాన్ vs క్వాలిఫయర్, హైదరాబాద్
అక్టోబర్ 12: పాకిస్థాన్ vs క్వాలిఫయర్, హైదరాబాద్
అక్టోబర్ 15: పాకిస్థాన్ vs భారత్, అహ్మదాబాద్

అక్టోబర్ 20: పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా, బెంగళూరు
అక్టోబర్ 23: పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్, చెన్నై
అక్టోబర్ 27: పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా, చెన్నై
అక్టోబర్ 21: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్, కోల్‌కతా
నవంబర్ 5: పాకిస్థాన్ vs న్యూజిలాండ్, బెంగళూరు
నవంబర్ 12: పాకిస్థాన్ vs ఇంగ్లాండ్, కోల్‌కతా