మోర్గాన్​ మోత : అఫ్గానిస్థాన్‌‌పై ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ

మోర్గాన్​ మోత : అఫ్గానిస్థాన్‌‌పై ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ

మాంచెస్టర్‌‌ :  పసికూన అఫ్గానిస్థాన్‌‌పై టైటిల్‌‌ ఫేవరెట్‌‌ ఇంగ్లండ్‌‌ పంజా విసిరింది. సొంతగడ్డపై ఇంగ్లిష్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ రెచ్చిపోయి రికార్డులు తిరగరాయడంతో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌‌ 150 రన్స్‌‌ తేడాతో అఫ్గానిస్థాన్‌‌పై విజయం సాధించింది. దీంతో ఆడిన ఐదు మ్యాచ్‌‌లో  నాలుగు విజయాలు సాధించిన ఇంగ్లండ్‌‌ టేబుల్‌‌ టాపర్‌‌ స్థానానికి చేరగా, ఐదో ఓటమి మూటగట్టుకున్న అఫ్గాన్‌‌ సెమీస్‌‌ రేస్‌‌ నుంచి ఔటైన తొలి జట్టు అయింది. కెప్టెన్‌‌ ఇయాన్‌‌ మోర్గాన్‌‌ (71 బంతుల్లో 4 ఫోర్లు, 17 సిక్సర్లతో 148) ధనాధన్‌‌ ఇన్నింగ్స్‌‌కు తోడు జానీ బెయిర్‌‌స్టో (99 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 90), జో రూట్‌‌(82 బంతుల్లో  5ఫోర్లు, సిక్సర్‌‌తో 88) చెలరేగడంతో టాస్‌‌ గెలిచి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఇంగ్లండ్‌‌ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. అఫ్గాన్‌‌ బౌలర్లలో  గుల్బదిన్‌‌ నైబ్‌‌ (3/68), దౌలత్‌‌ జద్రాన్‌‌(3/85) మూడేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌లో ఓవర్లన్నీ ఆడిన అఫ్గాన్‌‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 247 రన్స్‌‌ చేసింది. హష్మతుల్లా షాహిదీ(100 బంతుల్లో 5ఫోర్లు,2 సిక్సర్లతో 76) హాఫ్‌‌ సెంచరీ చేయగా,  అస్గర్‌‌ అఫ్గాన్‌‌(48 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) రాణించాడు. ఇంగ్లిష్‌‌ బౌలర్లలో ఆర్చర్‌‌ (3/52),  ఆదిల్​ రషీద్‌‌ (3/66) మూడేసి వికెట్లు తీశారు. మోర్గాన్‌‌ మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా ఎంపికయ్యాడు.

చివరి పది ఓవర్లలో 142

ఇంగ్లండ్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ చివరి పది ఓవర్లలో 142 రన్స్‌‌ పిండుకుని పరుగుల వర్షం కురుపించారు. మోర్గాన్‌‌, రూట్‌‌కు తోడుగా చివర్లో మొయిన్‌‌ అలీ(9 బంతుల్లో 1 ఫోర్‌‌, 4 సిక్సర్లతో 31 నాటౌట్‌‌)కు చెలరేగడంతో ఇంగ్లండ్‌‌ 400కు దగ్గరగా వచ్చింది. ధారాళంగా పరుగులిచ్చుకున్న అఫ్గాన్‌‌ బౌలర్లు చివరి ఆరు ఓవర్లలో 95 రన్స్‌‌ ఇచ్చి నాలుగు వికెట్లు తీశారు. అంతకముందు జేసన్‌‌ రాయ్‌‌ గైర్హాజరుతో ఓపెనింగ్‌‌కు వచ్చిన జేమ్స్‌‌ విన్స్‌‌(26) స్వల్ప స్కోరు చేసి వెనుదిరగ్గా మరో ఓపెనర్‌‌ జానీ బెయిర్‌‌స్టో, వన్‌‌డౌన్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ జో రూట్‌‌తో కలిసి భారీ స్కోరుకు పునాది వేశాడు. ఈ జోడి రెండో వికెట్‌‌కు 120 పరుగులు జోడించింది. బెయిర్‌‌స్టో తన స్ట్రోక్‌‌ ప్లే చూపించగా, రూట్ స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ యాంకర్‌‌ రోల్‌‌ పోషించాడు. సెంచరీకి చేరువైన జానీ.. గుల్బదిన్‌‌కి సులువైన రిటర్న్‌‌ క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రూట్‌‌కు జతకలిసిన మోర్గాన్‌‌ ఆ తర్వాత ఇన్నింగ్స్​ను పరుగెత్తించాడు. నెమ్మదిగా గేర్లు మార్చి సెంచరీకి దగ్గరగా వచ్చిన రూట్‌‌ కూడా గుల్బదీన్‌‌ బౌలింగ్‌‌లోనే  ఔటయ్యాడు. బట్లర్‌‌(2), స్టోక్స్‌‌(2) నిరాశపరిచారు. చివర్లో మొయిన్‌‌ అలీ మెరుపులు మెరిపించి ఇన్నింగ్స్‌‌కు అదిరిపోయే ఫినిషింగ్‌‌ ఇచ్చాడు.

విసిగించిన హష్మతుల్లా, అస్గర్‌‌

భారీ ఛేజింగ్‌‌లో అఫ్గాన్‌‌ జట్టు ఏ దశలోను విజయం  దిశగా సాగలేదు. అయితే ఆ జట్టు బ్యాట్స్‌‌మన్‌‌ పూర్తి కోటా ఓవర్లు ఆడడమే లక్ష్యంగా క్రీజులో పాతుకుపోయారు. ఓపెనర్ నూర్‌‌ అలీ డకౌట్‌‌ అవ్వగా, మరో ఓపెనర్‌‌ గుల్బదిన్‌‌(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌‌తో 37), రహ్మత్‌‌ షా(74 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌‌తో 46) పరుగులు చేశారు. ముఖ్యంగా హష్మతుల్లా షాహిది, అస్గర్‌‌ అఫ్గాన్‌‌ ఇంగ్లండ్‌‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఇద్దరూ కలిసి 16 ఓవర్లు పాటు క్రీజులో పాతుకుపోయారు. ఈ క్రమంలో హష్మతుల్లా హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకోగా, 41వ ఓవర్‌‌లో అస్గర్‌‌ను ఔట్‌‌ చేసి నాలుగో వికెట్‌‌కు 94 రన్స్‌‌ పార్ట్​నర్‌‌షిప్‌‌ను విడదీసిన ఆదిల్​ రషీద్‌‌ ఇంగ్లండ్ శిబిరంలో ఉత్సాహం నింపాడు.