
- ఇందులో మహిళల సంఖ్య 31.20 కోట్లు
- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడి
- జీ-7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఇండియాలో ఓటేసిన వారి సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ
- ఇండియన్స్‌గా గర్వించదగ్గ విషయం
- కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్న సీఈసీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎలక్షన్ పోలింగ్‌లో ఇండియా వరల్డ్ రికార్డు సాధించిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. వారిలో 64.2 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు చెప్పారు. వీరిలో 31.20 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈసీ బృందం లేచి.. మహిళా ఓటర్లను అభినందిస్తూ చప్పట్లు కొట్టింది. ప్రపంచంలో ఇప్పటి దాకా ఈ స్థాయిలో ఓటింగ్ ఏ దేశంలో నమోదు కాలేదని రాజీవ్ కుమార్ వివరించారు. ఇండియన్స్‌గా ఇది మనందరికీ గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇదొక చరిత్రాత్మక ఘట్టమని తెలిపారు. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం ప్రకటించనున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. కౌంటింగ్‌కు సంబంధించిన కీలక అంశాలను సోమవారం ఉదయం ఆయన మీడియాకు వెల్లడించారు. ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాం. మంగళవారం ఎన్నికల ఫలితాలు రిలీజ్ చేస్తాం. మన దేశంలో మొత్తం 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో 64.20 కోట్లమంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదొక ప్రపంచ రికార్డ్’’ అని ప్రకటించారు.
జీ7 దేశాలతో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువ
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా (జీ-7) దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఇండియాలో ఓటు హక్కు వినియోగించుకున్నవారి సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ అని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ‘‘మేము ఓటర్లను పోలుస్తున్నాం.. పోటీలో ఉన్నవారిని కాదు.. ఇది యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. 31.20 కోట్ల మంది మహిళలు ఓటు వేశారు.. ఇది కూడా ప్రపంచంలోనే అత్యధికం. ఇది 2019 ఎన్నికల కంటే ఎక్కువ. మహిళా ఓటర్లను మనం గౌరవించాలి’’అని అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో హయ్యెస్ట్ ఓటింగ్
జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి పోలింగ్ 58.58 శాతం దాటిందన్నారు. నాలుగు దశాబ్దాల్లో ఇదే హయ్యెస్ట్ అని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 39 చోట్ల మాత్రమే రీ పోలింగ్ నిర్వహించామని తెలిపారు. 2019లో 540 చోట్ల రీ పోలింగ్ చేపట్టినట్టు వివరించారు. ఈసారి మొత్తం రూ.10 వేల కోట్లు విలువ చేసే లిక్కర్, డ్రగ్స్, క్యాష్ వంటివి సీజ్ చేసినట్టు తెలిపారు. 2019 ఎన్నికల టైమ్‌లో సీజ్ వాటి విలువ రూ.3,500 కోట్లు ఉందని వివరించారు.
సోషల్ మీడియా మీమ్స్‌పై సీఈసీ సెటైర్
సోషల్ మీడియాలో ఎలక్షన్ కమిషనర్లను ఉద్దేశిస్తూ పోస్ట్ చేస్తున్న మీమ్స్‌పై కూడా సీఈసీ రాజీవ్ కుమార్ స్పందించారు. ‘‘జెంటిల్మెన్ పత్తా లేకుండా పోయారు’’అంటూ కొందరు తమను ఉద్దేశిస్తూ ఎఫ్బీ, ట్విట్టర్లో కామెంట్లు చేస్తున్నారన్నారు. తాము ఎక్కడికీ పోలేదని, ఇక్కడే ఉన్నామన్నారు. 8 గంటల నుంచి 8.30 వరకు బ్యాలెట్ ఓట్లు, 8.30 నుంచి ఈవీఎం ఓట్లు లెక్కింపు ప్రారంభం అవుతుందని వివరించారు.
ముంబైలో మూవీ మ్యాక్స్ థియేటర్ లో ఫలితాలు..
ఈసీ అధికారిక వెబ్సైట్లో ఫలితాలు ట్రాక్ చేయొచ్చు. మహారాష్ట్రలో మూవీ మ్యాక్స్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల నుంచి ‘ఎలక్షన్ రిజల్ట్స్ 2024 షో’ ప్రారంభం అవుతుంది.
ఇయ్యాల్నే కౌంటింగ్, ఫలితాలు
ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపర్చిన ఈవీఎంలు, బ్యాలెట్ బాక్సులను పలుచోట్ల కౌంటింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా రావడంతో బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీల నేతలు సంబురాలకు సిద్ధమవుతున్నారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ముగిసే దాకా సంబురాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్దమొత్తంలో లడ్డూలు, జిలేబీలు, స్వీట్లు తయారు చేయించారు. యూపీ, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు, యూటీలలో ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు లెక్కకుమించిన సంఖ్యలో లడ్డూలను ఆర్డర్ ఇచ్చారు. పాట్నాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ.. మానేర్ లడ్డూ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఈ లడ్డూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. నెయ్యితో చేసిన ఈ రాజస్థానీ లడ్డూలు కిలో రూ.620కు విక్రయిస్తున్నారు. క్వింటాళ్ల కొద్దీ లడ్డూలకు ఆర్డర్లు వచ్చినట్టు షాపు ఓనర్ తెలిపాడు.
ఎన్నికల విధుల్లో ఎంత మంది?
- సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల కోసం దేశ వ్యాప్తంగా 1.50 కోట్ల మంది పోలింగ్,
- సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించారు.
- 68,763 బృందాలు ఈ ఎన్నికలను పర్యవేక్షించాయి.
- 135 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు
- ఎన్నికల ఏర్పాట్ల కోసం నాలుగు లక్షల వెహికల్స్‌ను ఉపయోగించారు.
- 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం రాలేదు.
- ఎన్నికల సమయంలో సీ- విజిల్ యాప్‌లో 4.56 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో 99.9శాతం ఫిర్యాదులను పరిష్కరించారు.
- 87.5శాతం ఫిర్యాదులను వంద నిమిషాల్లోపే పరిష్కారం చూపారు. డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేశారు.