
మన శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో పని చేస్తుంటుంది. అయితే అన్ని అవయవాలలో కళ్లు చాలా ప్రత్యేకమైనవి. చూపు లేకపోతే ఈ రంగుల ప్రపంచమంతా చీకటిగా అనిపిస్తుంది.ఏ పని చేయాలన్నా మరొకరి తోడు అవసరం అవుతుంది. అందుకే ‘సర్వేంద్రియాణం నయనం ప్రధానం’ అంటారు. పుట్టినప్పుడు ఆరోగ్యంగా, అందంగా మెరుస్తున్న కళ్లు చూస్తే ముచ్చటేస్తుంది. కానీ.. అవే కళ్లు పెరిగేకొద్దీ దృష్టి లోపానికి దారితీస్తే.. ఆ సమస్యల్ని ఆపలేం. అయితే.. ఆ తప్పు ఎవరిది? హెల్దీగా ఉన్న బాడీలో ఒక పార్ట్ దెబ్బతినడానికి మన అలవాట్లే కారణమా? ఏదేమైనా కండ్లను బాగా చూసుకునే బాధ్యత మనదే.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతోమంది కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే ఎవరికి వాళ్లు వాళ్ల కంటి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వైద్యం గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఏడాది వరల్డ్ సైట్ డే థీమ్ ‘‘లవ్ యువర్ ఐస్’’ అని పెట్టారు. ఈ డేని ప్రతిఏటా ‘‘ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ది బ్లైండ్నెస్’’ (ఐఎపిబి) అక్టోబర్ 9న నిర్వహిస్తోంది. మరి కళ్లను ఎందుకు ప్రేమించాలో ఈ సందర్భంగా ఆప్తమాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ మాటల్లో...
సోషల్ స్మైల్
బిడ్డ పుట్టిన తర్వాత కొద్ది నెలల్లోనే కంటిచూపు ఉందా? లేదా? అనేది తెలుస్తుంది. ఇదే మొదటి మైల్స్టోన్. దీన్ని సోషల్ స్మైల్ అంటారు. తల్లి నుంచే అవేర్నెస్ మొదలు కావాలి. సోషల్ స్మైల్‌ని గుర్తించాలి. అది లేనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అంతేకాకుండా శిశువు ఏదైనా వస్తువును చూడడం, పట్టుకోవడం వంటివి చేయడం ద్వారా వాళ్ల చూపు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. శిశువును పిలిచినప్పుడు శబ్దం వచ్చినవైపు కాకుండా మరో వైపు చూస్తే కంటిచూపులో సమస్య ఉన్నట్లు గుర్తించాలి.
నిజానికి పిల్లల్లో కంటి సమస్య అంతకంటే ముందు నుంచే ఉండొచ్చు. కానీ, క్లినికల్‌గా మూడు లేదా నాలుగు నెలల వయసులోనే నిర్ధారణ అవుతుంది. జన్యుపరంగా కొన్ని రకాల కంటి సమస్యలు రావొచ్చు. లేదా ప్రెగ్నెన్సీలో తల్లికి జ్వరం వంటి సమస్యలు ఏవైనా వస్తే పుట్టిన బిడ్డకు కంజెనిటల్ కాటరాక్ట్ వచ్చే చాన్స్ ఉంది. అలాంటప్పుడు వెంటనే సర్జరీ చేయాలి. లేదంటే కంటికి కో– ఆర్డినేషన్ ఉండదు. దాంతో ‘లేజీ ఐ’ వస్తుంది. అంటే ఒక కన్ను లేదా రెండు కళ్లలో దృష్టి సరిగా ఏర్పడకపోవడం. ఇవే కాకుండా గ్లకోమా వంటి సమస్యలు కూడా రావొచ్చు.
ప్రీ స్కూల్ టెస్ట్
పిల్లల్ని మొదటిసారి స్కూల్‌కి పంపించేటప్పుడు ప్రీ స్కూల్ టెస్ట్ చేయించాలి. అంటే కంటిచూపు ఎలా ఉందో చెక్ చేయాలి. ఈ రోజుల్లో స్క్రీన్ టైం బాగా ఎక్కువైపోయింది. పిల్లలకు తినిపించాలంటే పేరెంట్స్ వాళ్లకు స్క్రీన్ ముందు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ స్టయిల్ వల్ల ఇలా అలవాటు చేస్తున్నారు చాలామంది. కానీ, ఎంత బిజీ ఉన్నా పిల్లల ఆరోగ్యం పట్ల కచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇలాంటి అలవాట్లను ప్రోత్సహించకూడదు.
రాత్రుళ్లు కంటిచూపు..
రెటినిటిస్ పిగ్మెంటోసా అంటే రాత్రుళ్లు కంటి చూపు ఉండదు. దీన్నే రేచీకటి (నైట్ బ్లైండ్నెస్) అంటారు. ఇది ముఖ్యంగా మేనరికం పెండ్లిళ్లు చేసుకున్న వాళ్ల పిల్లల్లో ఎక్కువగా గుర్తిస్తుంటాం. వయసు పెరిగేకొద్దీ రేచీకటి సమస్య తీవ్రత ఎక్కువ అవుతుంది. కొంతకాలం తర్వాత వాళ్లు పూర్తిగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతో వాళ్లు ఎటూ కదల్లేని పరిస్థితికి వస్తారు. ప్రస్తుతానికి దీనికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ లేదు. కానీ, త్వరలోనే స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అందుబాటులోకి రానుంది. ఏ వయసు వాళ్లకైనా ట్రాన్స్‌ప్లాంట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ ట్రీట్మెంట్ వస్తే ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్లకు మేలు జరుగుతుంది.
ఎక్కువగా చదివితే..
‘‘బాగా చదివే పిల్లలకు కంటిచూపు దెబ్బ తింటుంది. కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది”అంటుంటారు. అయితే ఇందులో నిజం లేదు. రూంలో లైటింగ్ సరిగా లేకపోవడం, గంటల తరబడి పుస్తకం చూస్తూ ఉండడం వల్ల కళ్లు అలసిపోతాయి. ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ చేస్తే కంటి సమస్యలు రావొచ్చు. కానీ, పుస్తకం చదవడం వల్ల సైట్ వస్తుందనేది వాస్తవం కాదు. స్క్రీన్ ఈ – బుక్స్ వంటివి ఎక్కువసేపు చదివితే మాత్రం తప్పకుండా కళ్లు ఎఫెక్ట్ అవుతాయి. 40 – 45 సెంటిమీటర్ల దూరంలో పెట్టుకుని చదివితే మంచిది.
రెగ్యులర్ చెకప్స్
పిల్లలకు ప్రీ స్కూల్ టెస్ట్ తప్పనిసరి. ఆల్రెడీ సైట్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్లకు రెగ్యులర్ చెకప్ అవసరం. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా ఐ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. రెటినా చెకప్, డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుకోవాలి. 40 పైబడ్డాక కచ్చితంగా గ్లకోమా స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ముందు నుంచే కుటుంబమంతా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇవన్నీ ప్రివెంటివ్ ప్రాబ్లమ్స్. ముందుగానే తెలుసుకుంటే వాటిని రాకుండా అడ్డుకోవచ్చు.
పరిస్థితులు తీవ్రంగా మారితే సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. సైట్ ఒక్కసారి వస్తే పోదు. సమస్య తీవ్రం కాకుండా ఆపొచ్చు. కానీ, పూర్తిగా తగ్గదు. ప్రస్తుతం ఇండియాలో ఏ స్టేట్‌కి వెళ్లి చూసినా ఐ సైట్ ఇష్యూస్‌తో బాధపడేవాళ్లు చాలామంది కనిపిస్తున్నారు. మన అలవాట్ల వల్ల ఇది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు స్క్రీన్ టైం, సూర్య రశ్మి తగలకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడమే. కాబట్టి అలవాట్లు మార్చుకుంటే ఏ సమస్యా ఉండదు. కళ్ల గురించి కేర్ తీసుకోండి.
ఇవి పాటిస్తే చాలు
విటమిన్ ‘ఎ’ ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. సీజనల్ ఫ్రూట్స్ తప్పనిసరిగా తినాలి. కోడిగుడ్డు, చేపలు కంటి ఆరోగ్యానికి మంచివి. సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఆరుబయట ఆటలాడటం, వ్యాయామాలు చేయడం వంటివి రెగ్యులర్‌గా చేస్తుండాలి.
స్ర్కీన్ చూసేటప్పుడు..
బ్లూలైట్ గ్లాసెస్ వాడడం, బ్లూ లైట్ ఆప్షన్లు ఆన్‌లో ఉంచుకోవడం బెటర్. అంతకంటే ముఖ్యంగా కంప్యూటర్ లేదా ల్యాప్‌ట్యాప్ ఏదైనా స్క్రీన్ వాడేవాళ్లు 20 –20 –20 రూల్ పాటించాలి. 20 నిమిషాలు మాత్రమే కంటిన్యూగా స్క్రీన్ చూడాలి. 20 సెకండ్లు బ్రేక్ ఇవ్వాలి. ఆ బ్రేక్‌లో 20 అడుగుల దూరంలో ఉన్నవాటిని చూడాలి. ఎందుకంటే కళ్లు ఏదైనా చూస్తున్నప్పుడు కంటిపాపలు దగ్గరకు వచ్చేస్తాయి. అలా ఎక్కువసేపు ఉండకూడదు. వాటిని కదిలిస్తూ ఉండాలి. అందుకే దూరంగా ఉన్న వాటిని చూసినప్పుడు కళ్లు నార్మల్ పొజిషన్‌కి వచ్చేస్తాయి. దీంతోపాటు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్‌లో పదిసార్లు చొప్పున కళ్లను తిప్పాలి. చేతిని ముందుకు చాపి బొటన వేలును చూస్తూ.. నెమ్మదిగా కంటి దగ్గరకు అంటే బొటనవేలు మీకు రెండుగా కనిపించేవరకు తీసుకురావాలి.
ఇలా పదిసార్లు చేయాలి. దీన్ని కన్వర్షన్ ఎక్సర్సైజ్ అంటారు. ప్రస్తుతం 40 - 50 ఏండ్ల కిందట పిల్లలకు చిన్నప్పుడు స్క్రీన్ టైం అనేది అసలు లేదు. ఆడుకోవడం, నేచర్‌లో ఎక్కువసేపు గడపడం చేసేవాళ్లు. అందువల్ల కళ్లద్దాలు పెట్టుకునేవాళ్లు చాలా అరుదుగా కనిపించేవాళ్లు. ఇప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరు సైట్ అని చెప్పి కళ్లజోడు పెట్టుకుంటున్నారు. అందులో కూడా ముఖ్యంగా మూడు రకాలున్నాయి. షార్ట్ సైట్‌ని మయోపియా, లాంగ్ సైట్‌ని మెట్రోపియా, 40 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేదాన్ని ప్రెస్బయోపియా అంటారు. 40 తర్వాత రీడింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇది చాలా కామన్. వయసు ప్రభావం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా వచ్చేది మయోపియా.
- డాక్టర్ శ్రీధర్ ఎ.
కన్సల్టెంట్ ఆప్తమాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్