
ఒకప్పుడు టీబీతో మనుషులు పిట్టల్లా రాలిపోతుండె. అప్పుడు అదొక పెద్ద రోగం అనుకున్నరు. వస్తే నయం కాదనుకున్నరు. మందులు కనుగొన్నంక టీబీ నివారించగలిగే జబ్బుల జాబితాలో చేరింది. అయినా ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 4,500 మంది టీబీతో చనిపోతున్నరు. ఈ వ్యాధిపై అవగాహన లేకే ఇదంతా.. అవగాహన కలిగించేందుకు ఏటా మార్చి 24న వరల్డ్ టీబీ డే నిర్వహిస్తున్నరు.
టీబీ’ని సమూలంగా మట్టుబె ట్టడానికి ఇదే సమయం. ‘టీబీ రహిత దేశంగా మారుస్తం’ అని ప్రతిజ్ఞలు చేసిన ప్రపంచ నేతల మాటల్ని ఆచరణలో పెట్టడానికి ఇదే సమయం. మాటల్లేవు…మాట్లాడుకోవడాలు లేవు… టీబీని నివారించడానికి ఇదే సమయం. అందరు ఒక్కతాటిపైకి వచ్చి టీబీని అంతం చెయ్యడానికి చర్యలు తీసుకోవాలి. ఇదే ఈ ఏడాది ‘టీబీ డే’కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నినాదం. ‘ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ .. ఇట్స్ టైం ఫర్ ఎండ్ టీబీ’ అని గొంతెత్తింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజర్ (WHO).
ఈ రోజే ఎందుకు?
టీబీకి మందుల్లేక.. ఒకరి నుంచి ఒకరికి సోకుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు తీసుకుంటోంది. టీబీ పేరు వింటేనే గజగజ వణుకుతున్న సమయంలో ‘నేను ఉన్న’ అంటూ అప్పుడే వచ్చిండు ఒక మహానుభావుడు. ‘ టీబీకి కారణమయ్యే బ్యాక్టీరి యాను కనుగొన్న’ అంటూ 1882లో ఇదే రోజు (మార్చి 24) న ప్రకటించిండు. ఆయన పేరు డాక్టర్ రాబర్ట్ కోచ్ . జర్మన్ మైక్రోబయాలజిస్ట్ . ఆయన పరిశోధనే టీబీ నివారణ వ్యాక్సిన్ కనుగొనేందుకు దారులు వేసింది. టీబీని అంతం చెయ్యడానికి అడుగులు పడినయ్. టీబీ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ఈ రోజుని వరల్డ్ టీబీ డేగా జరుపుకుంటున్నరు.