చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు : కలెక్టర్ సీహెచ్ ప్రియాంక

చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు :  కలెక్టర్ సీహెచ్  ప్రియాంక

నెట్​వర్క్, వెలుగు : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధి, చారిత్రక ప్రాంతాల సంరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణపేట జిల్లా ముడుమాల్‌‌‌‌లోని మెగాలిథిక్ సమాధులను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సమర్పించామని కలెక్టర్ సీహెచ్  ప్రియాంక పేర్కొన్నారు. నల్గొండలో  ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్ ను  కలెక్టర్ బి. చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. 

అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గద్వాలలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని చారిత్రక ప్రదేశాల విశిష్టతను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలో దురాజ్‌‌‌‌పల్లి, మట్టపల్లి, పిల్లలమర్రి వంటి ప్రాంతాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ వద్ద మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ కె. హైమావతిల ఆధ్వర్యంలో స్టూడెంట్ హెరిటేజ్ వాక్ నిర్వహించగా, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ప్రపంచ పర్యాటక జాబితాలో భారత్ 39వ స్థానానికి చేరిందని ఎంపీ తెలిపారు.