కాల్పులు ఆపాలె... హమాస్​–ఇజ్రాయెల్ ​పోరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

కాల్పులు ఆపాలె... హమాస్​–ఇజ్రాయెల్ ​పోరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

న్యూఢిల్లీ: హమాస్​– ఇజ్రాయెల్​ యుద్ధంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో హమాస్​కు వ్యతిరేకంగా, మరికొన్ని దేశాల్లో ఇజ్రాయెల్​కు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కాల్పుల విరమణకు పిలుపునిస్తూ యూదు సంస్థల సానుభూతిపరులు సహా వందలాది మంది పాలస్తీనా అనుకూల నిరసనకారులు బుధవారం వాషింగ్టన్ డీసీలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. 

లాస్ ఏంజిల్స్‌‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ బయట పాలస్తీనియన్ మద్దతుదారులు ఇజ్రాయెల్​కు వ్యతిరేక నినాదాలు చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ అనుకూల ర్యాలీ జరగడం ఘర్షణలకు దారితీసింది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌‌లో వేలాది మంది ప్రజలు పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ తీశారు. టొరంటో ఇతర కెనడా సిటీల్లోనూ పాలస్తీనా అనుకూల ర్యాలీలు సాగాయి. యూకేలోని లండన్ సహా ఇతర సిటీల్లో పాలస్తీనియన్ అనుకూల ప్రదర్శనలు జరిగాయి. నిషేధం ఉన్నప్పటికీ ప్యారిస్‌‌లోనూ ఇజ్రాయెల్​కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. 

గాజాలో తక్షణమే కాల్పుల విరమణ  పాటించాలని డిమాండ్​ చేస్తూ ఇండోనేషియాలో జనం ఆందోళనలు చేపట్టారు. పాలస్తీనియన్లకు సంఘీభావంగా మొరాకోలోని రబాత్‌‌లో వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. లెబనాన్‌‌లోని బీరూట్‌‌లో పాలస్తీనియన్ మద్దతుదారులు చేపట్టిన నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారింది. భారీగా పోగైన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు, జల ఫిరంగులు ప్రయోగించారు.