టాప్‌‌ 722 కంపెనీలకు లక్షల కోట్ల లాభాలు

టాప్‌‌ 722 కంపెనీలకు లక్షల కోట్ల లాభాలు

బిజినెస్‌‌ డెస్క్‌‌ వెలుగు:  ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 722 కార్పొరేట్ కంపెనీలు  కరోనా తర్వాత నుంచి ప్రతీ ఏడాది ట్రిలియన్ డాలర్ల (రూ.82 లక్షల కోట్ల) ప్రాఫిట్‌‌ను సంపాదించాయి.  పెట్రోల్‌‌, డీజిల్‌‌, గ్యాస్ ధరలు భారీగా పెరగడం, వడ్డీ రేట్లు గరిష్టాలకు చేరుకోవడంతో  ఈ కంపెనీలు 2021 లో 1.08 ట్రిలియన్ డాలర్లు (రూ.89 లక్షల కోట్లు), 2022 లో 1.09 ట్రిలియన్ డాలర్ల లాభాన్ని పొందాయని ఆక్స్‌‌ఫామ్‌‌, యాక్షన్ఎయిడ్‌‌ విడుదల చేసిన రిపోర్ట్‌‌ వెల్లడించింది. 

కరోనా సంక్షోభం, ఉక్రెయిన్‌‌–రష్యా యుద్ధంతో ధరలు పెరగడం  వలన సామాన్య ప్రజలు బతకడానికి  ఇబ్బంది పడగా, ధనవంతులు మాత్రం మరింత ధనికులుగా మారారని పేర్కొంది. గత రెండేళ్లలో  వందల కోట్ల మందికి తగినంత  ఆహారం, త్రాగు నీరు దొరక లేదని పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం, 2017–2020 మధ్య టాప్‌‌ 722 కంపెనీలకు వచ్చిన సగటు ప్రాఫిట్‌‌తో పోలిస్తే గత రెండు సంవత్సరాల్లో వచ్చిన సగటు ప్రాఫిట్‌‌ 89 శాతం ఎక్కువగా ఉంది. లాభాలు సడెన్‌‌గా  భారీగా  పెరగడాన్ని  విండ్‌‌ఫాల్‌‌ ప్రాఫిట్స్‌‌ అని పిలుస్తున్నారు. ప్రభుత్వాలు ఇటువంటి ప్రాఫిట్స్‌‌పై ఎక్కువగా ట్యాక్స్ వేయాలని నిపుణులు కోరుతున్నారు. ఇండియాలో క్రూడాయిల్ ప్రొడక్షన్‌‌, డీజిల్‌‌ ఎగుమతులపై ప్రభుత్వం విండ్‌‌ఫాల్ ట్యాక్స్ వేసిన విషయం తెలిసిందే. 

లాభపడ్డది ఇవే..

ఫార్మా, ఎనర్జీ, బ్యాంక్స్‌‌, ఫుడ్‌‌ వంటి వివిధ సెక్టార్లలోని టాప్ కంపెనీలు ఎక్కువగా లాభపడ్డాయని ఆక్స్‌‌ఫామ్ రిపోర్ట్ వెల్లడించింది. ఫోర్బ్స్‌‌ 2000 పెద్ద కంపెనీల లిస్ట్‌‌లో చోటు దక్కించుకున్న 45 కంపెనీలు గత రెండేళ్లలో యావరేజ్‌‌గా 237 బిలియన్ డాలర్ల (రూ.19 లక్షల కోట్ల) ప్రాఫిట్స్‌‌ను సాధించాయి. ఎనర్జీ సెక్టార్‌‌‌‌లోనే కొత్తగా 96 మంది బిలియనీర్లు పుట్టుకురావడం విశేషం. వీరి మొత్తం సంపద 432 బిలియన్ డాలర్ల (రూ.35 లక్షల కోట్ల) కు సమానం. ఫుడ్ అండ్ బెవరేజెస్‌‌ సెక్టార్‌‌‌‌కు చెందిన 18 కార్పొరేట్ కంపెనీలు సగటున 14 బిలియన్ డాలర్ల (రూ.1.14 లక్షల కోట్ల) ప్రాఫిట్స్‌‌ సాధించాయి. 28 ఫార్మా కంపెనీలు  ఏడాదికి 47 బిలియన్ డాలర్ల (రూ.3.9 లక్షల కోట్ల) లాభాన్ని పొందగా, ఏరోస్పేస్‌‌, డిఫెన్స్‌‌ సెక్టార్‌‌‌‌కు చెందిన తొమ్మిది కంపెనీలు 8 బిలియన్ డాలర్లను సాధించాయి. ఇదే టైమ్‌‌లో 58 దేశాల్లోని  25 కోట్ల మందికి తగినంత తిండి దొరకలేదని, కాస్ట్ ఆఫ్ లివింగ్‌‌ బాగా పెరగడంతో బతకడానికి ఇబ్బంది పడ్డారని ఆక్స్‌‌ఫామ్‌‌ రిపోర్ట్‌‌ వివరించింది. 

దేశంలోని బిలియనీర్లపై ట్యాక్స్ వేయాలి...

గ్లోబల్ కంపెనీలు దురాశ వలన పేదరికం మరింత పెరుగుతోందని, కాస్ట్ ఆఫ్ లివింగ్‌‌ ఎక్కువవుతోందని నిపుణులు వెల్లడించారు. డెవలప్ అయిన దేశాల్లో కూడా  ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ కంపెనీల కళ్లు చెదిరే లాభాలు అనైతికమే కాకుండా, కార్పొరేట్‌‌ల దురాశ వలన ఇన్‌‌ఫ్లేషన్‌‌ పెరగడం చూస్తున్నామని ఆక్స్‌‌ఫామ్‌‌ అడ్వకసి హెడ్‌‌ ఖ్యాతి చక్రవర్తి అన్నారు. కోట్ల మంది ప్రజలు తమ బిల్లులు పే చేసుకోవడానికి, కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బందులు పడుతున్నారని  పేర్కొన్నారు. విండ్‌‌ఫాల్ ట్యాక్స్‌‌ను తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇండియాలో 2012 –2021 మధ్య 10 శాతం మంది జనాభా సంపద 40 శాతం పెరగగా, కిందిస్థాయిలో ఉన్న 50 శాతం మంది జనాభా సంపద కేవలం 3 శాతం మాత్రమే పెరిగింది. ప్రస్తుతం దేశంలో  183 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిపై విండ్‌ఫాల్ ట్యాక్స్ వేయాలని నిపుణులు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. 

ధనికులు ఐదు రెట్లు పెరుగుతారు..

దేశంలోని మహా ధనవంతులు సంఖ్య భవిష్యత్‌‌లో ఐదు రెట్లు పెరుగుతుందని పీపుల్స్ రీసెర్చ్ ఓ సర్వేలో పేర్కొంది. సూపర్ రిచ్ కుటుంబాలలో ఎక్కువ భాగం రూరల్ ఏరియాల నుంచి వస్తాయ ని అంచనావేసింది. ఏడాదికి  రూ. రెండు కోట్ల కంటే ఎక్కువ సంపాదించే హౌస్‌‌హోల్డ్‌‌ను సూపర్‌‌ రిచ్‌‌ ఫ్యామిలీగా పిలుస్తున్నారు. వీటి సంఖ్య  2021 నుంచి ఐదేళ్లలో 18 లక్షలకు పెరుగుతుం దని ఈ స్టడీ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఇలాంటి హౌస్‌‌హోల్డ్స్‌‌ 14.2 శాతం గ్రోత్  చూస్తున్నా యని, అర్బన్ సిటీలలోని  హౌస్‌‌హోల్డ్స్‌‌ను 10.6 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాయని వివరించింది. 2031 నాటికి సూపర్ రిచ్ ఫ్యామిలీస్‌‌ 91 లక్షలకు చేరుకుంటాయని వెల్లడించింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వేగంగా వృద్ధి చెందుతున్నాయని తెలిపింది.