
కరోనా వైరస్ నియంత్రించేందుకు అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉన్నామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో 52 చెక్ పోస్టు లు ఏర్పాటు చేసామని, రాష్ట్రంలోకి వచ్చేవారిని తనిఖీలు చేసేందుకు 78 ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి అన్నారు. మన దేశంలో ఒక్క మహరాష్ట్రలోనే 65 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన క్రమంలో.. పరిస్థితులని బట్టి రెండు మూడు రోజుల తర్వాత మహరాష్ట్ర బోర్డర్ బంద్ చేస్తామని చెప్పారు.
బయటి దేశం నుండి వచ్చే వాళ్ళతోనే ఇబ్బంది అవుతుందని చెప్పిన కేసీఆర్… విదేశాల నుండి వచ్చిన వారు సమాజ హితం కోరి ప్రభుత్వం చెప్పిన నియమాలను పాటించాలని చెప్పారు. ఈ నియంత్రణలను తప్పనిసరిగా అనుసరించాలని దండం పెట్టి చెపుతున్నానని అన్నారు. నియంత్రణ పాటించకుండా పారిపోవడం దారుణమన్నారు.
విదేశం నుంచి వచ్చిన వారు ఎవరైన సరే.. వాలంటరీగా వారంతటే వారే పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు . టెస్ట్ లలో పాజిటివ్ అని కన్ఫామ్ అయితే బాధితుల ఇంటివద్దే వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందన్నారు. దగ్గు, జ్వరం,శ్వాస కోశ ఇలాంటి ఇబ్బందులు ఉంటే సంబంధిత ఆస్పత్రుల్లో చూపించుకోవాలని చెప్పారు. అందుకు ఎలాంటి డబ్బు ఖర్చు కాదని చెప్పారు. వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, ప్రభుత్వ సిబ్బంది ల గ్రామాల్లో ఎవరైనా విదేశం నుంచి వచ్చిన వారుంటే వారి వివరాలను హాస్పిటల్ లో తెలపాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి ఏ సమస్య కూడా రానివ్వమని చెప్పారు ముఖ్యమంత్రి. అవసరమైతే అంతటా షట్ డౌన్ చేస్తామని చెప్పారు. మనదేం పేద రాష్ట్రం కాదని, ప్రజా శ్రేయస్సు కోసం పది వేల కోట్లయినా ఖర్చు చేస్తామని చెప్పారు. అత్యవసరమైతే ప్రజలందరికీ 15 రోజులకు సరిపడా రేషన్ సరుకులు పంపుతామన్నారు. పత్రి ఇంటికి పంపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ బతికుండగా ప్రజలు నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రానివ్వం అని చెప్పారు సీఎం.