
కురుక్షేత్ర: చైనాతో బార్డర్ వివాదాన్ని పరిష్కరించడంలో మోడీ సర్కార్ విఫలమైందంటూ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పలుమార్లు విమర్శించారు. తాజాగా మరోమారు సరిహద్దు ఉద్రిక్తతలపై రాహుల్ కామెంట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే మన దేశం నుంచి చైనాను 15 నిమిషాల్లోపు అవతలకు విసిరేసే వాళ్లమని రాహుల్ అన్నారు. ఖేతీ బచావో యాత్రలో భాగంగా పబ్లిక్ ర్యాలీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పిరికి వ్యక్తి అని ఆయన చెప్పారు.
‘మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదని పిరికి ప్రధాని అంటున్నారు. కానీ ప్రపంచంలో ఒక దేశ భూభాగాన్ని మరో దేశం ఆక్రమించడం కేవలం ఇక్కడే జరిగింది. ఇండియాలోకి వేరే దేశం చొచ్చుకువచ్చి 1,200 స్క్వేర్ కిలో మీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. అయినా ప్రధాని తనను తాను దేశభక్తుడిగా పిలుచుకుంటున్నారు. కానీ చైనా దళాలు మన భూభాగంలోకి చొచ్చుకువచ్చాయనే విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. ఎలాంటి దేశ భక్తుడు ఆయన? ఒకవేళ మేం గనుక అధికారంలో ఉండుంటే చైనాను పదిహేను నిమిషాల్లోపు విసిరి అవతలకు పారేసేవాళ్లం. ఎందుకంటే మేం పవర్‌లో ఉన్న టైమ్‌లో ఏనాడూ మన టెరిటరీలోకి అడుగు పెట్టడానికి చైనా సాహసం చేయలేదు’ అని రాహుల్ పేర్కొన్నారు.