సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు

సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు

రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయకు 2021 సంవత్సరానికి సంబంధించి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ప్రముఖ రచయిత్రి భాషాసింగ్‌ రచించిన అదృశ్య భారత్‌(నాన్‌ ఫిక్షన్‌) హిందీ పుస్తకాన్ని సజయ ‘అశుద్ధ భారత్‌’పేరిట తెలుగులోకి అనువదించారు. జనవరి 1, 2015 నుంచి డిసెంబరు 2019 మధ్య ప్రచురితమైన పుస్తకాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేసినట్లు సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. జ్యూరీ సభ్యులుగా ఎస్‌.శేషారత్నం, వై.ముకుంద రామారావు, గుమ్మ సాంబశివరావు వ్యవహరించారు. దేశంలోని పారిశుధ్య కార్మికుల వాస్తవ జీవన చిత్రాన్ని అశుద్ధ భారత్‌ పుస్తకం ఆవిష్కరించింది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు.  ఇంగ్లిషు సహా 22 భారతీయ భాషల్లో అనువాద రచనలకు అవార్డులు ప్రకటించిన అకాడమీ.. మైథిలీ, రాజస్థానీ భాషాల్లో అనువాద పురస్కారాలను త్వరలో విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల దుర్భర జీవన స్థితిగతులపై ఆధారాల సహితంగా తెలుగులోకి అనువదించారు. సజయ స్వగ్రామం కృష్ణాజిల్లా పెద్ద ముత్తేవి.  సజయ మహిళల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశారు. 

నలుగురికి భాషా సమ్మాన్‌ అవార్డు
అకాడమీ కార్యనిర్వాహక బోర్డు 2019కిగానూ నాలుగు రీజియన్ల భాషా సమ్మాన్‌ అవార్డులను ప్రకటించింది. సంప్రదాయ, మధ్యయుగ సాహిత్యంపై చేసిన కృషికిగానూ ప్రొఫెసర్‌ దయానంద్‌(ఉత్తరం) ఎ.దక్షిణామూర్తి (దక్షిణం), సత్యేంద్ర నారాయణ్‌ గోస్వామి(తూర్పు), మహమ్మద్‌ అజం (పశ్చిమ)లను ఎంపిక చేసినట్లు పేర్కొంది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు.