కరీంనగర్ జిల్లాలో రైల్వే అధికారుల నిర్వాకం ప్రయాణికులను గందరగోళ పర్చింది. రైళ్ల రాకపోకల డిస్ ప్లే బోర్డు ప్రదర్శనలో రైల్వే అధికారులు నిర్లక్ష్యంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఓ రైలు రాకకు సంబంధించి డిస్ ప్లే బోర్డులో ప్రదర్శించాల్సిన ఉండగా.. మరో రైలు ఇన్ ఫర్మేషన్ ను డిస్ ప్లే చేశారు. దీంతో రైలు వచ్చి స్టేషన్ లో నిల్చున్నా..ప్రయాణికులు ఎక్కలేదు. తప్పుడు సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట రైల్వేస్టేషన్ లో సోమవారం (జనవరి 19) ఉదయం గందరగోళం చోటు చేసుకుంది. భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలుకు సంబంధించిన సమాచారం డిస్ ప్లే బోర్డులలో చూపాల్సి ఉండగా.. దక్షిణ ఎక్స్ ప్రెస్ సమాచారం డిస్ ప్లే చేశారు. దీంతో భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫాం పైకి వచ్చి ఉన్నా ప్రయాణికులు రైలు ఎక్కలేదు. దీంతో రైల్వే స్టేషన్ లో కొంత సమయం గందరగోళం నెలకొంది. సరైన సమాచారం లేకపోవడంతో అయోమయంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. రైల్వే అధికారులు నిర్లక్ష్యాన్ని తెలుసుకొని ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు రైలు ఎక్కారు.
ఈ ఘటన రైళ్ల రాకపోకల సమాచారం అందించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా ఎత్తి చూపింది. అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైళ్ల రాకపోకల సమాచారం, సిగ్నలింగ్, ట్రాక్ మెయింటెనెన్స్ వంటి కీలక రైల్వే విధుల్లో నిర్లక్ష్య వహిస్తే భారీ మూల్యం చెల్లించకోవాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
