నేటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్

నేటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
  • నువ్వా నేనా! 
  • జోరుమీదున్న రెండు జట్లు  మ. 3.00 నుంచి స్టార్​ స్పోర్ట్స్​లో 

144 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఎన్నో వందల టెస్ట్​లు.. మరెన్నో అపురూప విజయాలు.. ఇంకెన్నో ఘనతలు.. లెక్కలేనన్ని మైల్​స్టోన్స్​.. ఎందరో లెజెండ్స్​.. అందరూ ఆటను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు..!  కానీ ఇప్పుడు ఒకే ఒక్క మ్యాచ్​తో శిఖరం చేరే సమయం ఆసన్నమైంది..! ఘన వారసత్వానికి కొనసాగింపుగా.. జెంటిల్మన్​ గేమ్​లో అతి పెద్ద అడుగు ముందుకు పడబోతున్నది..! ఉత్కంఠ రేపే సిరీస్​లున్నా.. నరాలు బిగపట్టి చూసిన మ్యాచ్​లకు కొదువలేకున్నా.. ఒకే ఒక్క మ్యాచ్​ మాత్రం ఇప్పుడు క్రికెట్​ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది..! అదే ప్రతిష్టాత్మక వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్ ఫైనల్​​! లిమిటెడ్ ఓవర్లలో ఫార్మాట్​కో వరల్డ్​కప్​ ఉన్నా..  ట్రెడిషనల్‌ గేమ్‌కు మాత్రం ఇప్పటివరకు ప్రపంచ స్థాయి ట్రోఫీ మాత్రం లేదు..! ఇప్పుడు ఆ ట్రోఫీ (గద)ని అందుకునేందుకు ఇండియా, న్యూజిలాండ్​ సిద్ధమయ్యాయి..! ఒకరిదేమో దూకుడు.. మరొకరిదేమో నిలకడ..!  ఈ రెండింటి మధ్య అగ్గి పుట్టించే అసలు సిసలైన పోరాటం కోసం అటు విరాట్​ కోహ్లీ, ఇటు కేన్​ విలియమ్సన్​ రెడీ అయ్యారు..!   నేటి నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్‌ వార్‌..! మరి, ఈ అల్టిమేట్‌ టెస్ట్‌లో పాసయ్యేదెవరో.. సగర్వంగా గదను అందుకునేది ఎవరో..!!

సౌతాంప్టన్: కరోనా కష్టకాలంలో అతిపెద్ద ఆకర్షణగా నిలవబోతున్న వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్ ఫైనల్​​కు రంగం సిద్ధమైంది. వరల్డ్​ టాప్​ జట్లన్నీ పోటీపడ్డా.. కాలం పెట్టిన కష్టాలను అధిగమిస్తూ.. తమకు మాత్రమే సాధ్యమైన ఆటను ప్రపంచానికి చూపెడుతూ.. టైటిల్​ పోరుకు అర్హత సాధించిన ఇండియా, న్యూజిలాండ్​ ఇప్పుడు గ్రౌండ్​లో అసలు పోరాటానికి రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు యావత్​ క్రికెట్​ ఫ్యాన్స్​ను ఉర్రూతలూగించేందుకు ఇరుజట్లు  తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. దాదాపు130 కోట్ల మంది ఆశలు మోస్తున్న విరాట్​.. మహీ వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటుండగా.. ఐసీసీ ట్రోఫీని అందుకోలేకపోతున్న దేశానికి దానిని కానుకగా ఇవ్వాలని విలియమ్సన్  తమ ప్లాన్స్​ను సిద్ధం చేసున్నాడు. ప్రస్తుతం ఇద్దరు కెప్టెన్ల ఖాతాలో ఐసీసీ ట్రోఫీ లేదు. కాబట్టి.. గెలుపు కోసం ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు పోటీపడడం  ఖాయంగా కనిపిస్తోంది. 

రోహిత్​ x బౌల్ట్​
ఈ మ్యాచ్​ కోసం టీమిండియా ఓ రోజు ముందే ఫైనల్​ఎలెవన్​ను ప్రకటించింది. కెప్టెన్​ కోహ్లీ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల స్ట్రాటజీకి మొగ్గు చూపాడు. రోహిత్​ శర్మ, శుభ్​మన్​ గిల్​ ఓపెనింగ్​ చేయనున్నారు. కివీస్​ ట్రంప్​ కార్డ్‌ పేసర్లు బౌల్ట్​, వాగ్నర్​, జెమీసన్​ను ఎదుర్కొని వీళ్లు నిలబడితే ఇండియాకు శుభారంభం దక్కినట్లే. గిల్​కు ఎక్స్​పీరియెన్స్​ లేకపోవడంతో.. ఇన్నింగ్స్​ భారం మొత్తం రోహిత్​పైనే పడుతుంది. కాబట్టి హిట్​మ్యాన్​ సక్సెస్​ కావడం ఇండియాకు చాలా అవసరం. స్థూలంగా చెప్పాలంటే.. ఫస్ట్​ సెషన్​ మొత్తం రోహిత్​ వర్సెస్​ బౌల్ట్​గా సాగినా ఆశ్చర్యం లేదు. ఈ మ్యాచ్​లో హిట్​మ్యాన్​ రాణిస్తే.. ఇంగ్లండ్​తో జరిగే ఐదు టెస్ట్​ల సిరీస్​లోనూ ఇండియా విజయావకాశాలు మరింతగా పెరుగుతాయి. 

పరుగుల గోడ కట్టేదెవరో?
ఓపెనర్లు సక్సెస్​ అయినా, ఫెయిలైనా .. టాప్​ ఆర్డర్​లో పరుగుల గోడ కట్టేదెవరనేది కూడా ఆసక్తికరమే. వన్​డౌన్​లో నయా వాల్​ చతేశ్వర్​ పుజారా, నాలుగులో వచ్చే కెప్టెన్​ కోహ్లీ ఫామ్​ అందుకుంటే ఇండియాకు తిరుగుండదు. ఈ ఇద్దరూ వాగ్నర్​ షార్ట్​ పిచ్​ను దీటుగా ఎదుర్కొంటే.. పరుగుల వరద ఖాయం. ఇక వైస్​ కెప్టెన్ ​అజింక్యా రహానె తన క్లాస్​ ఆటను చూపించడంతో పాటు డాషింగ్​ హిట్టర్​ రిషబ్​ పంత్​.. పవర్​ హిట్టింగ్​ షాట్స్​తో అలరిస్తే ఇండియాకు ఎదురుండదు. రిబ్స్​లక్ష్యంగా వచ్చే షార్ట్​ పిచ్​లను పంత్​ భారీ షాట్స్​గా మలిస్తే భారీ స్కోరు ఖాయం. లోయర్​ ఆర్డర్​లో రవీంద్ర జడేజా, అశ్విన్​నుంచి కొన్ని పరుగులు ఆశించొచ్చు. 

వికెట్ల వీరుడెవరు?
ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఖాయం అని తేలిపోయింది కాబట్టి.. ఇప్పుడు కివీస్​ను నిలువరించి వణికించే బౌలర్​ ఎవరు? యాంగిల్స్​ బాల్స్​తో బుమ్రా, అనుభవంతో ఇషాంత్​..ఆరంభంలో కివీస్​ను దెబ్బకొడితే, పాత బంతితో షమీ అద్భుతాలు చేస్తాడు. తన లేట్​ స్వింగ్​ ఆయుధంతో కచ్చితంగా ఇబ్బందులు సృష్టిస్తాడని మేనేజ్​మెంట్​ నమ్మకంతో ఉంది. తొలి మూడు రోజులు​ పిచ్​ సీమర్లకు అనుకూలమని తేలింది కాబట్టి వీలైనంతగా ఇండియా పేస్​ అటాక్​.. ప్రత్యర్థిని ఇబ్బందిపెడితే, లాస్ట్​రెండు రోజులు స్పిన్నర్లు జడేజా, అశ్విన్​ చూసుకుంటారు. ఒకవేళ టర్నింగ్​ ట్రాక్ అయితే మాత్రం కివీస్​ లెఫ్టాండర్లకు అశ్విన్​ నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్​లో జడ్డూ ఆల్​రౌండ్​ షో ఇండియాకు అదనపు ప్రయోజనంగా మారనుంది. 

కాన్వేతో డేంజర్​
ఈ మ్యాచ్​ కోసం కివీస్​ కూడా పకడ్బంది ప్రణాళికలు రూపొందిస్తోంది. టీమ్​లో ఆల్​రౌండర్లకు కొదువలేదు కాబట్టి.. మంచి టాలెంటెడ్​ ఫైనల్​ ఎలెవన్​ను దించాలని భావిస్తోంది. అయితే ఇంగ్లండ్​తో రెండు టెస్ట్​లు ఆడి ఉండటం కేన్‌సేనకు అడ్వాంటేజ్​. అయితే రెండో టెస్ట్​ ఆడిన టీమ్​లో ఒకటి, రెండు మార్పులు చేసి ఆడించొచ్చు. అదే జరిగితే  ఓపెనింగ్​లో నయా సంచలనం డేవాన్​ కాన్వేతో ఇండియాకు డేంజర్​ ఉంది. అతను మంచి ఫామ్​లో ఉండటం కివీస్​కు కలిసొచ్చే అంశం. లాథమ్​ కొద్దిగా సపోర్ట్​ ఇచ్చినా ఇండియన్​ పేస్​ అటాక్​కు కష్టాలు తప్పవు. అయితే బుమ్రా యాంగిల్​ బాల్స్​ ధాటికి ఈ ఇద్దరు నిలబడతారా? అన్నది కూడా సందేహంగా ఉంది. మిడిలార్డర్​లో విలియమ్సన్, టేలర్​, నికోల్స్​, వాట్లింగ్​ పై భారం ఎక్కువగానే ఉంది. వీళ్లలో కనీసం ఇద్దరు ఫామ్​లోకి రావాల్సి ఉంటుంది. అయితే వీళ్లకు అశ్విన్​ క్యారమ్​ బాల్స్​ నుంచి ఇబ్బందులు తప్పవు. ఇక బ్యాటింగ్​తో పోలిస్తే​ బౌలింగ్​ పటిష్టంగా ఉండటం  కివీస్‌కు ప్లస్‌ పాయింట్‌ అనొచ్చు. అయితే  పేసర్లు నలుగురా, ముగ్గురా అన్నది తేలాలి. బౌల్ట్​కు తోడుగా జెమీసన్, సౌథీ, వాగ్నర్​ పేస్​ బాధ్యతలు పంచుకోనున్నారు. ఏకైక స్పిన్నర్​గా అజాజ్​పటేల్​ను ఆడించే చాన్స్​ ఉంది. 

స్థాయికి తగ్గట్టు ఆడతాం
ఐదు రోజులు పాటు జరిగే ఒక్క మ్యాచ్​ రిజల్ట్​తో మా సత్తా డిసైడ్​ కాదు. కొంతకాలంగా మా ఆటను గమనిస్తున్న వాళ్లకి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫైనల్లో మేము గెలిచినా ఓడినా క్రికెట్​ కొనసాగుతుంది. మమ్మల్ని మేము మెరుగుపర్చుకునే తపనలో మార్పు ఉండదు. బ్యాటింగ్, బౌలింగ్​లో అన్ని ఏరియాలు కవర్​ అయ్యేలా ఫైనల్​ ఎలెవన్​ను ఎంచుకున్నాం. నా వరకు డబ్ల్యూటీసీ ఫైనల్​ మరో మ్యాచ్​ మాత్రమే. కానీ బయటి వ్యక్తులకు ఇది చావో రేవోలా అనిపిస్తుంది. కానీ ఈ మూమెంట్​ను మేమంతా ఎంజాయ్​ చేయాలని అనుకుంటున్నాం. ఓ బలమైన ప్రత్యర్థితో తలపడుతున్నామని మాకూ తెలుసు. అందుకే స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్​ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. విలియమ్సన్​ నేనూ మంచి ఫ్రెండ్స్​. కివీస్​ ప్లేయర్లందరితోనూ మాకు మంచి అనుబంధం ఉంది. కానీ అదంతా ఫీల్డ్​ బయటే. బరిలోకి దిగాక విలియమ్సన్​ను ఎప్పుడెప్పుడు పెవిలియన్​కు పంపాలనే ఆలోచిస్తా
- ఇండియా కెప్టెన్​ విరాట్‌ కోహ్లీ

ఇండియా చాలా స్ట్రాంగ్‌‌ అని తెలుసు
వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఫైనల్‌‌కు చేరుకోవడం ఈ రెండేళ్లలో మా టీమ్‌‌ ఇంప్రూవ్‌‌మెంట్‌‌కు నిదర్శనం. ఈ టైమ్‌‌లో ప్రతి రోజు మాకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. మా టీమ్‌‌ వాటిని దాటుకొని ముందుకొచ్చింది. ఈ క్రమంలో చాలా బలంగా మారింది. ఫైనల్‌‌  బెర్తు దక్కించుకునేందుకు మేం చాలా హార్డ్‌‌వర్క్‌‌ చేశాం. ఫైనల్‌‌ చాలా ఎగ్జైటింగ్‌‌గా అనిపిస్తున్నా.. మా ప్రగతిని కొనసాగించాలని భావిస్తున్నాం. ఈ మ్యాచ్‌‌లో ఫేవరెట్‌‌ అన్న ట్యాగ్‌‌ గురించి మేం ఎక్కువగా ఆలోచించడం లేదు. మా ఫోకస్‌‌ మొత్తం ఆటపైనే పెట్టాం. ఎందుకంటే  వరల్డ్‌‌లో ఎక్కడైనా ఇండియా చాలా స్ట్రాంగ్‌‌ టీమ్‌‌.  వాళ్లతో గట్టి పోటీ తప్పదని మాకు తెలుసు. 
- న్యూజిలాండ్‌‌ కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌

 సౌతాంప్టన్‌లో  చివరగా ఆడిన రెండు టెస్టుల్లో (2014, 2018) ఇండియా ఓడిపోయింది. కానీ, ఇదే గ్రౌండ్‌లో ఆడిన మూడు ఐసీసీ టోర్నీ మ్యాచ్‌ల్లో గెలిచింది. మరోవైపు ఈ వేదికపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో  (వన్డేలు) న్యూజిలాండ్ గెలిచింది. 

1 గత ఐదు ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌‌ను ఇండియా ఒక్కసారే (2003 వన్డే వరల్డ్‌‌కప్‌‌) ఓడించింది. 
46 టెస్టుల్లో  200 వికెట్లు తీసి 2000 రన్స్‌ చేసిన ఇండియా ఐదో క్రికెటర్‌గా నిలిచేందుకు జడేజాకు అవసరమైన రన్స్‌. గతంలో కపిల్‌ దేవ్‌, కుంబ్లే, హర్భజన్‌, అశ్విన్‌  ఈ ఫీట్‌ సాధించారు. 

జట్లు 
ఇండియా: రోహిత్​, గిల్, పుజారా,  కోహ్లీ (కెప్టెన్​), రహానె, పంత్​(కీపర్‌), జడేజా, అశ్విన్​, బుమ్రా, షమీ, ఇషాంత్​. 
న్యూజిలాండ్ (అంచనా)​: లాథమ్, కాన్వే, విలియమ్సన్‌ (కెప్టెన్), టేలర్‌, నికోల్స్‌, బాట్లింగ్‌ (కీపర్‌), గ్రాండ్‌హోమ్‌, సౌథీ, అజాజ్‌ పటేల్‌/ జెమీసన్‌, వాగ్నర్‌, బౌల్ట్‌. 

పిచ్​, వాతావరణం
తొలి మూడు రోజులు​ సీమర్లకు అనుకూలం. చివరి రెండు రోజులు స్పిన్​కు చాన్స్​ ఉందని క్యూరేటర్​ చెప్పాడు. బ్యాట్స్​మన్​ ఓపిక చూపెడితే పరుగుల వరద ఖాయం. మ్యాచ్​కు చిరుజల్లులు అంతరాయం కలిగించొచ్చని వాతావరణ నివేదిక.