- కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి, వెలుగు: నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు, సాధారణ పరిశీలకులు గౌతమి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లకు ఫారం 10 ప్రకారం ఫలితాలు ప్రకటించాలని సూచించారు. ఉప సర్పంచుల ఎంపిక ప్రక్రియ ముగించాలన్నారు.
నామినేషన్ల ప్రక్రియ రిపోర్టులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు టీ పోల్లో నమోదు చేయాలని అన్నారు. ఎన్నికలు జరిగే గ్రామాలలో స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్లను నియామకం పూర్తి చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోరిన వారి అప్లికేషన్లను పరిశీలించి అవకాశం కల్పించాలన్నారు. ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలెటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని అన్నారు.
బ్యాలెట్ పేపర్ నిబంధనల ప్రకారం ముద్రించాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఎటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు, డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, డీపీవో విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.
