బోరు బావులే దిక్కు...అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్ సర్వేలో వెల్లడి

బోరు బావులే దిక్కు...అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్ సర్వేలో వెల్లడి
  • యాదాద్రి జిల్లాలో బోర్ల కింద  2.31 లక్షల ఎకరాలు సాగు
  • 1.23 లక్షల ఎకరాలకు  వర్షమే ఆధారం.. 
  • బావులు, చెరువుల కింద 50 వేలు  
  • కెనాల్స్ కింద 36 వేల ఎకరాలు    

​యాదాద్రి, వెలుగు : మెట్ట ప్రాంతమైన యాదాద్రి జిల్లాలో పంటల సాగుకు బోరు బావులే పెద్ద దిక్కుగా మారాయి. సగానికిపైగా పంటలు బోరు బావుల కిందే సాగు  అవుతున్నట్టు తేలింది. మరో 25 శాతం పంటలు వర్షాధారంగా సాగు అవుతున్నాయి. 

సాగుపై సర్వే..

జిల్లాలో పంటల సాగుపై సర్వే చేయాలని అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్​ను సర్కారు ఆదేశించింది. ఎక్కడ ఏ వనరులు అందుబాటులో ఉనాయో పరిశీలించాలని సూచించింది. దీంతో రంగంలోకి దిగిన అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్ పంటలు ఏ నీటితో సాగు చేస్తున్నారో లెక్క తేల్చి నివేదికను రూపొందించింది.ఈ నివేదికను కలెక్టర్​పమేలా సత్పతి కమిషనరేట్​కు  పంపించనున్నారు.  

బోరు బావులే కిందే ఎక్కువ సాగు..

జిల్లాలో వ్యవసాయానికి బోరు బావుల కిందే ఎక్కువ విస్తీర్ణం సాగువుతోంది.  జిల్లాలో మొత్తం 6 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది.  17 మండలాల్లోని 92 క్లస్టర్లలో 4,38,534 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో వరి సాగుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 89,648 బోరు బావులు ఉన్నాయి. వీటి కింద 2,31,394 ఎకరాల్లో  పంటలు సాగు చేస్తున్నారు. 9,760 బావుల కింద 29,973 ఎకరాలు, చెరువుల కింద 18,101 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కాగా వర్షాధారంగా 1,23,124 ఎకరాల్లో పత్తి, కంది వంటి వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. 

తేలిపోయిన గొప్పలు

కేసీఆర్​ తీసుకున్న నిర్ణయాల కారణంగానే.సాగు పెరిగిందంటూ బీఆర్ఎస్​ గొప్పలు చెప్పుకుంటోంది. యాదాద్రి జిల్లా ఏర్పడే నాటికి 60 వేల ఎకరాల్లో సాగు అయ్యేది. ఇప్పుడు వరి 3 లక్షల ఎకరాలకు చేరుకుంది.  అయితే  భువనగిరిలో బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణం ఏండ్లు గడుస్తున్నా  కొనసాగుతూనే ఉంది. గంధమల్ల రిజర్వాయర్​ పనులే ప్రారంభం కాలేదు.  2019 నుంచి వానలు ఎక్కువ పడుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగి బోరు బావుల్లో నీరు చేరింది. దీంతో బోరు బావుల కింద సాగు పెరిగింది. క్రమ క్రమంగా అన్ని పంటలు కలిపి 2.81  లక్షల ఎకరాల సాగు వరకూ చేరింది. అగ్రికల్చర్​ ఆఫీసర్లు నిర్వహించిన సర్వేతో బీఆర్ఎస్​ చెప్పుకుంటున్న గొప్పలకు చెక్​ పెట్టినట్లయింది.

కెనాల్స్​ కింద తక్కువే

తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాలో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు.  భూదాన్​ పోచంపల్లి, బీబీనగర్​, భువనగిరిలోని కొన్ని ఏరియాలో మూసి నీటితో వరిని సాగు చేస్తున్నారు. ఈ మూడు మండలాల్లో కలిపి కెనాల్స్​ కింద 35,942 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు