భార్య, భర్త ఓట్లు.. వేర్వేరు వార్డుల్లో ఎలా వచ్చాయ్‌?..ప్రశ్నించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు

భార్య, భర్త ఓట్లు.. వేర్వేరు వార్డుల్లో ఎలా వచ్చాయ్‌?..ప్రశ్నించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు

యాదాద్రి, వెలుగు: ఒకే ఇంట్లో ఉండే వారి ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఎలా చేరుస్తారని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రశ్నించారు. ముసాయిదా ఓటర్ లిస్ట్​పై యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు లిస్ట్​పై యాదాద్రి జిల్లాలో పొలిటికల్​ పార్టీల లీడర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

ఫ్యామిలీ ఓట్లన్నీ ఒకే  చోట ఉండకుండా వేర్వేరు వార్డుల్లో ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఒకే ఇంట్లో ఉండే భార్య, భర్తల ఓట్లు వేర్వేరు ఎలా చేస్తారన్నారు. అదే విధంగా ఒక వార్డుల్లోని ఓట్లు వేర్వేరు వార్డుల్లోకి ఎలా మార్చారని ప్రశ్నించారు. ఒక వార్డులో తక్కువ ఓట్లు, మరో వార్డులో ఎక్కువ ఓట్లు ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అన్ని వార్డుల్లో ఓట్లు సమానంగా ఉండేలా లిస్ట్​ మార్చాలని డిమాండ్​ చేశారు. ముసాయిదా తరహాలో ఫైనల్​ లిస్ట్​లో తప్పులు జరగకుండా రూపొందించాలని కోరారు. 

లిస్ట్​ సరి చేయండి

ముసాయిదా లిస్ట్​పై వచ్చిన అభ్యంతరాలు, పొలిటికల్​ పార్టీల ప్రతినిధుల అభ్యంతరాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావు ఆదేశించారు. మున్సిపల్​ కమిషనర్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. ఇంటి నెంబర్​పై ఉన్న ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండేలా చూడాలని సూచించారు. భార్య భర్తల ఓట్లు వేర్వేరు వార్డుల్లో చేరిస్తే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లిస్ట్​ను సరి చేయాలని ఆదేశించారు.