- గతేడాదే ప్రారంభమైన రెండు యూనిట్లు
- మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
- రాష్ట్రంలో 6,380 మెగావాట్లకు చేరుకున్న థర్మల్ విద్యుత్
- అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో మరో యూనిట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఒకటి, రెండో యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా.. తాజాగా నాలుగో యూనిట్‌లో పవర్ జనరేషన్ మొదలైంది. దీంతో మొత్తం 3 యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఈ 3 యూనిట్లలో కమర్షియల్ ఆపరేషన్ డేట్(సీఓడీ) కంప్లీట్ చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 6,380 మెగావాట్లకు చేరుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు. యాదాద్రి ప్లాంట్‌లో పెండింగ్‌లో ఉన్న మిగతా రెండు యూనిట్లను సైతం మరో 3 నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు స్పీడప్
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) నిర్మాణానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జెన్‌కో ఆధ్వర్యంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల కెపాసిటీతో 5 యూనిట్లు నిర్మించేందుకు రూ. 29 వేల కోట్లు కేటాయించింది. 2017లో బీహెచ్‌ఈఎల్ కంపెనీతో వర్క్ అగ్రిమెంట్లు చేసుకున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆరేండ్ల పాటు పనులు జరిగినా గడువులోపు పూర్తి చేయలేకపోయారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక యాదాద్రి థర్మల్ ప్లాంట్‌పై డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి సారించారు.
ఇందులో భాగంగా ఒక్కో యూనిట్‌ను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. గడిచిన రెండున్నరేండ్లలో మూడు ప్లాంట్లలో పవర్ జనరేషన్ స్టార్ట్ చేశారు. నిరుడు జనవరి 25న రెండో యూనిట్ సీఓడీ కంప్లీట్ చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేయగా.. అదే ఏడాది జులై 12న మొదటి యూనిట్, ఈ ఏడాది జనవరిలో నాలుగో యూనిట్‌లో పవర్ జనరేషన్ స్టార్ట్ అయింది. ఇక మిగిలిన మూడో యూనిట్‌ను మే నెలాఖరులోగా, ఐదో యూనిట్‌ను జూన్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క శనివారం అసెంబ్లీలో ప్రకటించారు.
రాష్ట్రంలో మొత్తం 6,380 మెగావాట్ల థర్మల్ పవర్
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి మొదలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,380 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని జెన్‌కో ప్రకటించింది. కొత్తగూడెంలో 4 యూనిట్ల ద్వారా 1,800, భూపాలపల్లి జిల్లా చెల్పూర్ కేటీపీపీ రెండు యూనిట్ల ద్వారా 1,100, భద్రాద్రి టీపీఎస్‌లో నాలుగు యూనిట్ల ద్వారా 1,080, యాదాద్రిలో 3 యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్టు జెన్‌కో ఆఫీసర్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 2,441.76 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హైడల్ పవర్, ఒక మెగావాట్ కెపాసిటీ గల సోలార్ పవర్ ఉత్పత్తి అవుతున్నదని పేర్కొన్నారు.
మొత్తం బొగ్గు సింగరేణి నుంచే...
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సింగరేణి సంస్థ నుంచే కొనుగోలు చేయడానికి జెన్‌కో సంస్థ అగ్రిమెంట్ చేసుకున్నది. ఈ ప్లాంట్‌లో పూర్తిస్థాయిలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మొదలైతే రోజుకు సుమారు 50 వేల టన్నులు, ఏటా 13 నుంచి 14 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గులో 50 శాతం సింగరేణి నుంచి మిగిలిన 50 శాతం విదేశీ బొగ్గును కొనాలని మొదట జెన్‌కో సంస్థ భావించింది.
కానీ తర్వాత నిర్ణయం మార్చుకొని మొత్తం బొగ్గును సింగరేణి నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. యాదాద్రి ప్లాంట్‌లో ప్రస్తుతం 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడంతో ఇందుకు అవసరమైన బొగ్గును గోదావరిఖని, శ్రీరాంపూర్, సత్తుపల్లి నుంచి తరలిస్తున్నారు. సింగరేణి గనుల్లో ఉత్పత్తి అయ్యే జీ9 నుంచి జీ13 కేటగిరీ బొగ్గును ప్రస్తుతం యాదాద్రి ప్లాంట్‌లో వినియోగిస్తున్నారు.
