యాదాద్రి వర్తక సంఘాన్ని రద్దు చేయాలి: నిరుద్యోగుల వినూత్న నిరసన

యాదాద్రి వర్తక సంఘాన్ని రద్దు చేయాలి: నిరుద్యోగుల వినూత్న నిరసన

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండపై గత 50 ఏండ్లుగా తిష్టవేసిన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు, యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు మంగళవారం నిరసన చేపట్టారు. కొందరు నిరుద్యోగులు లక్ష్మీనరసింహస్వామి వేషధారణలో హైదరాబాద్‌‌లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు వినూత్నంగా నిరసన తెలిపి, కమిషనర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు.

వర్తక సంఘం ప్రతినిధులు ఆలయ అధికారులతో కుమ్మక్కై బహిరంగ టెండర్లు నిర్వహించకుండా భక్తులను దోచుకుంటున్నారని, దీనివల్ల ఆలయ ఆదాయానికి భారీ గండి పడుతోందని వారు ఆరోపించారు. మరోవైపు యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డిని కలిసి, 114 షాపులకు బహిరంగ వేలం నిర్వహిస్తే ఆలయానికి ఏడాదికి సుమారు రూ.30 కోట్ల ఆదాయం వస్తుందని వివరించారు. రాజకీయ పలుకుబడితో షాపులను రెన్యూవల్ చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకుని, స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు.