యాదాద్రి పనుల రివ్యూలో సీఎం కేసీఆర్
క్యూ లైన్ల డిజైన్ రెండు వరుసలుగా మార్చండి
గుట్ట కింది చెరువును కాళేశ్వరం నీళ్లతో నింపండి
మూడు వారాల్లో మరో రూ.75 కోట్లు రిలీజ్చేస్తమని వెల్లడి
యాదాద్రిలో సీఎం ప్రత్యేక పూజలు.. నిర్మాణాల పరిశీలన
సీఎం పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు
యాదాద్రి, వెలుగు: ‘‘యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయం తరాల పాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం. ఎక్కడా తొందర పాటు వద్దు. సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం నిర్మాణం చేయండి”అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా, సుందరంగా ఆలయ ప్రాంగణం ఉండాలని సూచించారు. ఆది వారం యాదాద్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. లక్ష్మీనరసింహుడి దర్శనం, పనుల పరిశీలన తర్వాత రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఫీసర్లకు సలహాలు, సూచనలు చేశారు.కొండ చుట్టూ నిర్మించే రింగ్‌రోడ్డుకు ఇరువైపులా చెట్లు, స్ట్రీట్ లైట్లు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
5 వేల కార్లకు పార్కింగ్ ఉండాలె..
రాజగోపురం, ప్రధాన ద్వారాలకు బంగారు తాపడం కోసం పెంబర్తి (జనగామ జిల్లా) నుంచి నిపుణులైన స్వర్ణకారులను పిలిపించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆల్వార్, ఆండాళ్ అమ్మవార్లకు వెండి తాపడం చేయాలని చెప్పారు. ఆలయంలో ఒకేసారి నాలుగు వేల మంది సత్యనారాయణ వ్రతాలు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయం, టెంపుల్ సిటీ నుంచి డ్రైనేజీ నీళ్లను బయటకు పంపడానికి ప్రత్యేక నిర్మాణాలు చేయాలని ఆదేశించారు. కొండపై ఏర్పాటు చేసే పార్కింగ్ ప్లేస్ 5 వేల కార్లు, 10 వేల బైకులను పార్క్ చేసేలా ఉండాలన్నారు. ఆలయ నిర్మాణ పనుల కోసం మూడు వారాల్లో మరో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఫోన్లో ఆదేశించారు. టెంపుల్ సిటీ లేఔట్ మొత్తం సిద్ధమైందని, అక్కడ నిర్మాణాల కోసం వెయ్యి మంది దాతలు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ తెలిపారు. క్వార్టర్లు, కాటేజీల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్నారు.
కోతులకు కేసీఆర్ అరటిపండ్లు
రింగ్‌రోడ్డు పరిశీలనకు వెళ్లిన టైంలో కోతుల గుంపు కనిపించడంతో కేసీఆర్ కాన్వాయ్‌ను ఆపించారు. కిందికి దిగి కోతుల గుంపు దగ్గరికి వెళ్లారు. తన స్టాఫ్‌తో అరటి పండ్లు తెప్పించి కోతులకు వేశారు.
బీజేపీ నేతల నిర్బంధం
కేసీఆర్ యాదాద్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు స్థానిక బీజేపీ నేతలను ముందస్తుగా నిర్బంధించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో బీజేపీ ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌తో కేసీఆర్ పర్యటనలో ఆందోళన చేయవచ్చన్న ఉద్దేశంతో ఆదివారం తెల్లవారుజామునే.. నేతలు రచ్చ శ్రీనివాస్, తాడూరు లచ్చయ్య, అశోక్‌లను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతలను నిర్బంధించడాన్ని బీజేపీ యాదాద్రి అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు తప్పుపట్టారు.
సీఎం పర్యటన ఇలా..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రూ.1,200 కోట్లతో పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లుగా ఈ పనులు జరుగుతున్నాయి. వీటిని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు వచ్చారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి బాలాలయంలోకి తీసుకొని వెళ్లారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కొత్త ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆఫీసర్లు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత గర్భాలయంలో నరసింహుడిని దర్శించుకొని.. ప్రహ్లాద చరిత్ర, అద్దాల మండపాలను పరిశీలించారు. దాదాపు గంటసేపు కొత్త ఆలయంలో ఉన్న ఆయన.. బయటికి వచ్చాక అష్టభుజి మండపాలను, ఇటీవలి వర్షాలకు బ్రహ్మోత్సవ మండపం వద్ద కుంగిపోయిన స్టోన్ ఫ్లోరింగ్ రిపేర్లను పరిశీలించారు. 20 నిమిషాల పాటు శివాలయం పనులను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 2.30 టైంలో హరిత గెస్ట్‌హౌజ్‌కు చేరుకుని భోజనం చేశారు. కొండ దిగి.. రింగ్‌రోడ్డు పనులను పరిశీలించారు. భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కొండ కింద పుష్కరిణిని నిర్మిస్తున్న గండి చెరువు వద్ద వాహనాలను ఆపించి.. దాదాపు అరగంట సేపు పరిశీలించారు. నాలుగున్నర సమయంలో మళ్లీ కొండపైకి చేరుకుని.. సుమారు గంటన్నర పాటు అధికారులతో రివ్యూ చేశారు.
క్యూలైన్ మార్చండి
కొత్త ఆలయంలోకి వెళ్లే క్యూలైన్ డిజైన్ మార్చాలని కేసీఆర్ సూచించారు. మూడు వరుసల క్యూ లైన్ వద్దని, రెండు వరుసలే ఉండాలని చెప్పారు. కొండ దిగువన ఉన్న గండి చెరువులో తెప్పోత్సవం నిర్వహిస్తా మని.. 2 నెలలకోసారి కాళేశ్వరం జలా లతో దానిని నింపాలని ఆదేశించారు. కల్యాణకట్ట, బస్టాండ్, పుష్కరిణి రెయిలింగ్, రోడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగిం చాలన్నారు. ఉచిత బస్సు సౌకర్యానికి అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
