పార్కింగ్ చార్జీలపై వెనక్కి తగ్గిన గుట్ట దేవస్థానం కమిటీ

పార్కింగ్ చార్జీలపై  వెనక్కి తగ్గిన గుట్ట దేవస్థానం కమిటీ

యాదగిరిగుట్టపై పార్కింగ్ చార్జీల విషయంలో దేవస్థానం కమిటీ కాస్త వెనక్కి తగ్గింది. కొండపైకి వెళ్లే వాహనాల పార్కింగ్ కు అదనంగా విధించే 100 రూపాయల చార్జీని ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. వాహనం పార్కింగ్ కు ఇకపై 500 రూపాయలు వసూలు చేయనున్నారు. గుట్టపైకి వెళ్లే వాహనాలకు మొదట 500 రూపాయల పార్కింగ్ చార్జీ నిర్ణయించింది దేవస్థానం. గంట వరకు 500 రూపాయలు.. ఆ తర్వాత.. ప్రతీ గంటకు వంద చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 

 పార్కింగ్ చార్జీలపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా ధరలు నిర్ణయించారని మండిపడుతున్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత కొండపైకి వాహనాలను దేవస్థానం అనుమతించని సంగతి తెలిసిందే. అయితే, భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించాలని గత కొంత కాలంగా ఆందోళన నడిచింది. దీంతో కొండపైకి భక్తుల వాహనాలను అనుతించారు ఆలయ అధికారులు. అదే సమయంలో పార్కింగ్ ఫీజు పేరుతో భక్తులపై ఛార్జీల మోత మోగించడంతో విమర్శలు వస్తున్నాయి.