యాదగిరిగుట్టలో నిత్యాన్నదాన సత్రం ప్రారంభం..రూ.23 కోట్లతో 1.20 ఎకరాల్లో నిర్మాణం

యాదగిరిగుట్టలో నిత్యాన్నదాన సత్రం ప్రారంభం..రూ.23 కోట్లతో  1.20 ఎకరాల్లో నిర్మాణం
  •  రూ. 14 కోట్లు విరాళం ఇచ్చిన ఏపీకి చెందిన వేగేశ్న అనంతకోటి రాజు

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొత్తగా నిర్మించిన నిత్యాన్నదాన సత్ర భవనం ఆదివారం నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దాతలు, వైటీడీఏ, దేవస్థానం సహకారంతో నిర్మించిన ఈ సత్ర భవనాన్ని  ఈవో వెంకట్‌రావు, దాత వేగేశ్న అనంత కోటి రాజు ప్రారంభించారు. 1.20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 23 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. 

  ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన వేగేశ్న అనంతకోటి రాజు రూ.14 కోట్లు విరాళం ఇవ్వగా.. మిగతా ఖర్చులు వైటీడీఏ, దేవస్థానం భరించింది. ఈ భవనంలో రెండు డైనింగ్ హాళ్లు, రెండు వెయిటింగ్ హాళ్లతో పాటు 12 స్టోర్‌ రూమ్స్ ను నిర్మించారు.  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంట పరికరాలు, గిన్నెలు శుభ్రం చేసే మెషీన్లు, బాయిలర్లు, పైప్‌లైన్లు, గ్యాస్‌స్టౌవ్‌లతో విశాలమైన వంట గదిని నిర్మించారు. 

ఒకేసారి రెండు వేల నుంచి ఐదు వేల మంది భక్తులు కూర్చోని భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్‌శర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు, కృష్ణ, శంకర్‌ నాయక్‌, నవీన్‌  పాల్గొన్నారు.

గుట్టలో భక్తుల రద్దీ 

 గుట్టలో కొండపైన బస్‌బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపాలు భక్తులతో రద్దీగా మారాయి.  ఆలయానికి రూ.48,99,878 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.17,23,370, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.8.70 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5,98,500, బ్రేక్‌ దర్శనాలతో రూ.4,20,900 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.