యమునా నది కాలుష్యంపై సుప్రీంకోర్టు ఫైర్.. భారీ మూల్యం తప్పదని వార్నింగ్

యమునా నది కాలుష్యంపై సుప్రీంకోర్టు ఫైర్.. భారీ మూల్యం తప్పదని వార్నింగ్

న్యూఢిల్లీ: యుమునా నది కాలుష్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యమునా నది ప్రక్షాళన కోసం భారీగా ఖర్చు చేసినప్పటికీ నది కాలుష్యం తగ్గకపోగా మరింత పెరిగిందని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. యమునా నది కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమయ్యే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అధికారులు భారీ జరిమానాలను ఎదుర్కోవలసి వస్తుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా, మన్మోహన్‌లతో కూడిన ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. 

నది ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు, గ్రామాల మున్సిపల్ పరిపాలనలోని లోపాలన్నీ నది దుస్థితిలో ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యానించింది. సుమారు 520 మురుగు కాలువల ద్వారా నేరుగా మురుగునీరు యమునా నదిలోకి కలుస్తోందని.. అందుకే నది మరింత కాలుష్యం అవుతోందని అభిప్రాయపడింది. ఏదైనా రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం లేదా జిల్లా పరిధిలో ప్రవహిస్తున్నప్పుడు యమునా నీటి నాణ్యత క్షీణిస్తే, ఆయా ప్రభుత్వాలను బాధ్యులుగా చేస్తూ భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. 
రాష్ట్రాలు ఈ జరిమానా మొత్తాన్ని కాలుష్యానికి కారణమైన సంస్థలు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల నుండి వసూలు చేసుకోవచ్చని సూచించింది. యమునా నది దాని ప్రధాన కాలువలు ప్రతి రాష్ట్రం, జిల్లాలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే సరిహద్దుల వద్ద నీటి నాణ్యతను పర్యవేక్షించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి‎ను ఆదేశించింది.

 రాష్ట్రాలు ఇకపై తప్పుడు గణాంకాల వెనుక దాక్కోలేవని పేర్కొంది. కేవలం కొత్త మురుగునీటి శుద్ధి కర్మాగారాలు (STPs) నిర్మించడం వల్ల ప్రయోజనం లేదని పేర్కొన్న న్యాయస్థానం.. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటిని నదిలోకి కలవకుండా మూలం వద్దే అడ్డుకోవాలని సూచించింది. ఢిల్లీలో ఉన్న 37 STPలలో ఏ ఒక్కటీ పూర్తి ప్రమాణాలను పాటించడం లేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 

అన్ని ఎస్టీపీలు, కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నెల రోజుల్లోగా ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ ఎనర్జీ మీటర్లను అమర్చాలని కోర్టు ఆదేశించింది. అలాగే సీపీసీబీ ప్రతి మూడు నెలలకోసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని పేర్కొంది. యమునా నది పరిసరాల్లో అక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించింది.