delhi flood : ఎర్రకోటను తాకిన యమునా వాటర్.. 2 కిలోమీటర్లు వచ్చిన వరద

delhi flood : ఎర్రకోటను తాకిన యమునా వాటర్.. 2 కిలోమీటర్లు వచ్చిన వరద

వర్షాలు లేవు.. అయినా ఇప్పుడు ఢిల్లీ మునిగింది. 45 ఏళ్ల తర్వాత యమునా నది ఉగ్రరూపానికి ఢిల్లీ వీధులు నదిలా మారాయి. నదీ పరివాహక ప్రాంతాలు మాత్రమే కాదు.. ఎర్ర కోట వరకు వచ్చేశాయి యమునా నీళ్లు. 208 అడుగులకు పైన నదిలో నీళ్లు ప్రవహిస్తుండటంతో.. ఢిల్లీ గల్లీల్లోకి పోటెత్తింది వరద. 

ఢిల్లీలోనే చారిత్రక కట్టడం అయిన ఎర్ర కోటను తాకాయి యమునా నది నీళ్లు. యమునా ఘాట్ నుంచి ఎర్రకోటకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం వరద నీళ్లు వచ్చాయంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందే అర్థం అవుతుంది. ఎర్రకోట చుట్టూ ఉన్న రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఇంత దూరం వస్తాయని ఊహించని స్థానికులు.. ఇప్పుడు హడావిడిగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఎర్రకోట చుట్టూ ఉంటే వ్యాపారులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోతున్నారు. 

ఎర్రకోట వరకు యమునా నది నీళ్లు రావటం 45 ఏళ్లలో ఇదే. యమునా నది ఈ స్థాయిలో ఉగ్రరూపంగా ప్రవహించటం కూడా ఇదే. హిమాచల్ ప్రదేశ్, హర్యానా నుంచి నదిలోకి వరద పోటెత్తటంతో ఈ పరిస్థితి వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. 

 

ఢిల్లీ వీధులన్నీ నీళ్లమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో అయితే ఆరు, ఏడుగుల వరకు నీళ్లు వచ్చాయి. దీంతో మంచినీటి సరఫరాకు బ్రేక్ పడింది. కరెంట్ నిలిపివేశారు. జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రకోట వరకు వచ్చిన యమునా నీళ్లు.. ఇంకెంత దూరం వరకు వెళతాయి అనేది కూడా స్పష్టంగా చెప్పకలేకపోతున్నారు అధికారులు. మరో 24 గంటలు ఇలాంటి పరిస్థితే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు అధికారులు.