IND vs ENG 3rd Test: జైస్వాల్ మెరుపు సెంచరీ.. పట్టు బిగిస్తున్న భారత్

IND vs ENG 3rd Test: జైస్వాల్ మెరుపు సెంచరీ.. పట్టు బిగిస్తున్న భారత్

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ ఫామ్ కొనసాగుతుంది. ఇంగ్లాండ్ పై రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో టెస్టులో మెరుపు సెంచరీతో సత్తా చాటాడు. 122 బంతుల్లో 5 సిక్సులు, 9 ఫోర్లతో కెరీర్ లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి 41 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టని జైస్వాల్ క్రీజ్ లో కుదరుకున్నాక ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో గ్రౌండ్ ను హోరెత్తించాడు.

మొదటి 50 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసిన ఈ ముంబై కుర్రాడు.. ఆ తర్వాత తనలోని మరో కోణాన్ని చూపించాడు. అండర్సన్  వేసిన ఇన్నింగ్స్ 27వ ఓవర్లో వరుసగా 6,4,4 బాదేశాడు. ఆ తర్వాత ఓవర్లో హార్టీలి వేసిన 28 ఓవర్లో 5,6 బంతులను సిక్సర్లుగా మలిచాడు.  టీ20 ఫార్మాట్ స్టయిల్లో ఆడుతూ అభిమానులకు ఫుల్ పైకి ఇచ్చాడు. జైస్వాల్ కు మరో ఎండ్ లో గిల్ చక్కని సహకారం అందించడంతో భారత్ ఈ మ్యాచ్ పై పట్టు బిగిస్తుంది. వైజాగ్ లో జరిగిన రెండో టెస్టులో జైస్వాల్ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.  

 ప్రస్తుతం భారత్ వికెట్ నష్టానికి 158 పరుగులు చేసింది. జైస్వాల్ (100) గిల్ (34) క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు అజేయంగా  128 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. 19 పరుగులు చేసిన రోహిత్ శర్మ రూట్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇప్పటికే టీమిండియా  ఆధిక్యం 284 పరుగులకు చేరింది. చేతిలో మరో 9 వికెట్లు ఉండటంతో ఇంగ్లాండ్ ముందు టీమిండియా భారీ టార్గెట్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.