30 ఏండ్లలోపే అసెంబ్లీకి..సాధించిన యశస్విని రెడ్డి

30 ఏండ్లలోపే అసెంబ్లీకి..సాధించిన యశస్విని రెడ్డి
  •     పాలకుర్తిలో 26 ఏండ్లకే గెలిచి రికార్డ్​  సాధించిన యశస్విని రెడ్డి  
  •     మంత్రి దయాకర్​రావుకు షాక్​
  •     నారాయణ పేటలో పర్ణికారెడ్డి విక్టరీ 
  •     ఒకరు డాక్టర్​, మరొకరు ఇంజినీర్​..

జనగామ, వెలుగు :  జనగామ, నారాయణపేట జిల్లాల్లో 30 ఏండ్లలోపు ఇద్దరు యువతులు  పోటీ చేసిన మొదటిసారే విజయం సాధించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో మామిడాల యశస్విని రెడ్డి 26 యేండ్లకే విక్టరీ కొట్టి రికార్డు నెలకొల్పారు. తెలంగాణ రాష్ర్ట్రం ఏర్పాటయ్యాక ఎంపికైన అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. ఆదివారం జరిగిన కౌంటింగ్​లో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పై 47,132 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.  1997లో నాగర్​కర్నూల్​జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లిలో జన్మించిన యశస్విని రెడ్డి మహబూబాబాద్​జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెంకు చెందిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కొడుకు రాజారాంమోహన్​రెడ్డిని పెండ్లి చేసుకున్నారు.

2018లో ఇంజినీరింగ్​(ఈసీఈ) పూర్తి చేసిన ఆమె కాలిఫోర్నియాలోని తన కుటుంబ రియల్​ఎస్టేట్, ప్రాపర్టీ కంపెనీ అయిన రాజ్​ ప్రాపర్టీస్​లో ఉద్యోగం చేసేది.  ఈ క్రమంలో ముందుగా పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి అత్త  ఝాన్సీరెడ్డి పోటీ చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు. దీంతో చివరి నిమిషంలో టికెట్​ సాధించి  పక్కా ప్రచారంతో విజయం సాధించింది.  

తాత బాటలో పర్ణికారెడ్డి..

నారాయణపేట : నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పర్ణికారెడ్డి రాజకీయాల్లోకి వస్తూనే  ఎమ్మెల్యే పదవి కైవసం చేసుకున్నారు. పేటలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా నిలిచారు. 12 ఏండ్ల వయస్సులోనే మావోయిస్టుల కాల్పుల్లో ఆమె తాత, అప్పటి డిప్యూటీ స్పీకర్​ చిట్టెం నర్సిరెడ్డితో పాటు  తండ్రి, పీసీసీ ఉపాధ్యక్షుడైన చిట్టెం వెంకటేశ్వర్​రెడ్డిని పోగొట్టుకున్నారు. దీంతో ఆమె తల్లి లక్ష్మిని సర్కారు డిప్యూటీ కలెక్టర్​గా నియమించింది. అప్పుడే లక్ష్మి సోదరుడు, పర్ణిక మామ కుంభం శివకుమార్ ​రెడ్డి.. చిట్టెం నర్సిరెడ్డి వారసులను రాజకీయాల్లోకి తీసుకువస్తానని మాటిచ్చారు.

అన్నమాట ప్రకారంగా హైదరాబాద్​లో ఎంబీబీఎస్​ చదివి రేడియాలజిస్ట్​ పీజీ చేస్తున్న పర్ణికారెడ్డిని ఈ ఎన్నికల్లో రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. వచ్చీ రావడంతోనే ​అధిష్టానం ఆమెకు నారాయణపేట టికెట్ కేటాయించడంతో గెలుపును సవాల్​గా తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన​ రాజేందర్​రెడ్డిని 7,950 ఓట్ల తేడాతో ఓడించింది.  గత ఎన్నికల్లో రాజేందర్​రెడ్డి పర్ణికారెడ్డి మామ కుంభం శివకుమార్​రెడ్డిపై15, 600 ఓట్ల తేడాతో గెలిచారు.

దీంతో రాజేందర్​రెడ్డిపై గెలిచి తన మామ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఆదివారం ఆమె గెలిచిందని ప్రకటించిన వెంటనే సెంటర్​ దగ్గర  తన మామ కుంభం శివకుమార్​రెడ్డిని పట్టుకుని భావోద్వేగంతో ఆనందభాష్పాలు రాల్చారు.  పర్ణిక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు స్వయాన మేనకోడలు.