ఎమ్మెల్యేలు, ఎంపీలు.. విచక్షణతో ఓట్లేయండి

ఎమ్మెల్యేలు, ఎంపీలు.. విచక్షణతో ఓట్లేయండి

దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని భావించే వారంతా తనకే ఓటు వేయాలని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలంతా విచక్షణతో ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులకు విప్ జారీ చేసే అధికారాన్ని రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించలేదు. రహస్యంగా ఓటుహక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. దీన్ని వాడుకొని దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోండి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో యశ్వంత్ సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. పార్లమెంట్ లో ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  తమిళనాడు అసెంబ్లీలో సీఎం స్టాలిన్, యూపీ అసెంబ్లీలో  సీఎం యోగి ఆదిత్యానాథ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఎంపీలు పార్లమెంట్ లో, ఎమ్మెల్యేలు  ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.