మేనిఫెస్టో అంటే కులానికో పేజీ ఉండదు: జగన్

మేనిఫెస్టో అంటే కులానికో పేజీ ఉండదు: జగన్

మేనిఫెస్టో అంటే కులానికో పేజీ ఉండదన్నారు YCP అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. TDP 2014 ఎన్నికల్లో కులానికొక పేజీని కేటాయిస్తూ మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. 6 వందల హామీలను ఇచ్చారని, ఆ హామీలను చంద్రబాబు అమలు చేయలేదని ఆయన అన్నారు. అందుకే 2014 మేనిఫెస్టోను వెబ్‌సైట్‌నుంచి TDP మాయం చేసిందన్నారు. మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేయడం సరైంది కాదన్నారు జగన్. అమరావతిలోని YCP కార్యాలయంలో జగన్‌ 4పేజీలతో మేనిఫస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని అన్నారు.

మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు…

రాష్ట్రంలో కొత్త యుగానికి..కొత్త అధ్యయనానికి నాంధి పలుకుతున్నామన్న జగన్.. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఆక్వా రైతులకు రూపాయికి యూనిట్‌ కరెంటు ఇస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల బీమా ఇస్తామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తామన్నారు.  రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామన్నారు. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కింద ఏటా రూ.50 వేల రూపాయలు ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు రైతుభరోసా కింద ఏటా 12,500 రూపాయలు వీరికి అదనంగా  అందజేస్తామన్నారు.

YCP మేనిఫెస్టోపై ప్రతి రోజూ రివ్యూ చేస్తామన్నారు వైఎస్ జగన్. నవరత్నాల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. మనసా వాచా కర్మనా మేనిఫెస్టోను అమలు చేస్తామన్నారు. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో పేదవారందరికీ ఇళ్లు ఇస్తామన్నారు.

అందరికీ YSR ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తామన్నారు . వార్షిక ఆదాయం రూ.5లక్షలు దాటని అన్ని వర్గాల వారికి YSR ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని తెలిపారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే చాలు ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తామన్నారు. కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి నెలకు రూ.10వేలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల దశ దిశ మారుస్తామన్నారు.

రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని… మద్యాన్ని ఫైవ్‌ స్టార్‌ హొటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామన్నారు జగన్. నవరత్నాల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు.

అంతేకాదు వృద్ధాప్య పెన్షన్ రూ.3 వేలకు పెంచుతామని తెలిపారు వైఎస్ జగన్. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. బీసీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. శాశ్వత ప్రాతిపదికన BC కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ,మెస్ చార్జీల కింద విద్యార్థులకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. చేనేతన కార్మికులకు ఏటా రూ.24 లక్షలు కేటాయిస్తామన్నారు. పోడు భూములపై గిరిజనులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. న్యాయవాదులకు ప్రాక్టీస్‌ సమయంలో ప్రతి నెల 5 వేల రూపాయిల స్టైఫండ్  ఇస్తామని ఆయన అన్నారు. BC,SC,ST, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు జగన్.

శ్రీవారి సన్నిధిలో తలుపులు తెరిచే అవకాశం గొల్లలకు మళ్లీ కల్పిస్తామన్నారు వైఎస్ జగన్. SC,ST అమ్మాయిల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు… BC అమ్మాయిల పెళ్లిళ్లకు 50 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తామన్నారు. అమరావతి రాజధానిని ఫ్రీజోన్‌గా చేస్తామన్నారు.