వెయ్యి మంది బాలయ్యలు వచ్చినా ఎన్టీఆర్‌ను ఏం పీకలేరు : కొడాలి నాని

 వెయ్యి మంది బాలయ్యలు వచ్చినా ఎన్టీఆర్‌ను  ఏం పీకలేరు  : కొడాలి నాని

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగింపు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏపీ మాజీ మంత్రి, గుడివాడ  వైసీపీ ఎమ్మెల్యే  కొడాలి నాని  స్పందించారు.  కేవలం లోకేష్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్లెక్సీలు తొలగిస్తే జూనియర్‌ ఎన్టీఆర్‌కు వచ్చే నష్టమేమీలేదన్నారు. 

 వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా ఎన్టీఆర్‌ ను ఏమీ చేయలేరని చెప్పారు  కొడాలి నాని. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారు ఆయన వర్ధంతి చేస్తారా అని ప్రశ్నించారాయన. రాజకీయ పార్టీల్లో మార్పులు చేర్పులు సహజమన్నారు కొడాలి నాని. గత ఎన్నికల్లో అభ్యర్థులను చంద్రబాబు మార్చలేదా- అని నిలదీశారు.  గతంలో చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకు మారారన్న విషయాన్ని గుర్తుచేశారు.  జగన్‌ కోసం తాను ఏం చేయడానికైనా రెడీ అని స్పష్టం చేశారు. 

మరోవైపు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం ఈ ఉద్రిక్తతకు దారితీశాయి. గుడివాడలో రా కదలిరా పేరుతో టీడీపీ భారీ సభ నిర్వహిస్తుండగా.. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఇరు పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశాయి. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.