
బెంగళూరు: బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేయాలని కాంగ్రెస్ లీడర్ ప్లాన్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీజేపీ ఎలహంక ఎమ్మెల్యే ఎస్‌ఆర్ విశ్వనాథ్‌ను చంపాలని, ఎంత ఖర్చైనా పర్వాలేదని కాంగ్రెస్ లీడర్ గోపాలకృష్ణ ఒక వ్యక్తికి చెబుతున్నట్టు అందులో కనిపిస్తోంది. మూడు నిమిషాల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘‘ఆ ఎమ్మెల్యేను చంపేయండి. రూ.కోటి అంతకంటే ఎక్కువైనా పర్లేదు. పని పూర్తి చేయండి. ఈ విషయం మన మధ్యే ఉండాలి’’ అని కాంగ్రెస్ లీడర్ మరో వ్యక్తికి చెబుతున్నట్టుగా వినిపిస్తోంది. అయితే వీడియో ఎప్పటిది అని తెలుసుకునేందుకు దానిపై తేదీ లేదని, ఎంక్వైరీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే విశ్వనాథ్ తనతో ఫోన్‌లో మాట్లాడారని కర్నాటక హోం మినిస్టర్ అరగ జ్ఞానేంద్ర తెలిపారు. ‘‘వీడియో గురించి నిన్న రాత్రి తెలిసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఎమ్మెల్యేకు రక్షణ కల్పించే విషయంపై ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికి ఈ విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని జ్ఞానేంద్ర చెప్పారు.