మార్పు కోసం పసుపు సంచి

మార్పు కోసం పసుపు సంచి

రోజు రోజుకి ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతోంది. దాన్ని తగ్గించడానికి ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళనాడు ప్రభుత్వం క్లాత్‌ క్యారీ బ్యాగ్‌ వెండింగ్‌ మెషిన్‌ను తయారుచేసింది. త్వరలోనే వీటిని పబ్లిక్‌ ప్లేస్‌లలో పెట్టబోతోంది కూడా. ఈ క్లాత్‌ క్యారీ బ్యాగ్‌లను ఇక్కడి వాళ్లు ‘మంజ పై’ అంటారు. 

మంజపై అంటే పసుపు పూసిన సంచి.  వీటిని అక్కడి వాళ్లు తరతరాలుగా వాడుతున్నారు. అందుకే చాలామంది చేతుల్లో ఇవి కనిపించేవి. ఇదివరకు షాపుల్లో, గిఫ్ట్ ప్యాక్‌ల్లో వాడే సంచులకు పసుపు రుద్ది వాడేవాళ్లు. కారణం పసుపులో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు  ఉండటమే. పసుపు రాసిన ఈ సంచిలో పెట్టిన వస్తువులకు క్రిములు వ్యాపించకుండా చేయడమే కాకుండా, మనుషులను రోగాల బారిన పడకుండా కాపాడుతుందని నమ్మేవాళ్లు. దాన్నే మళ్లీ మొదలుపెట్టారు.  

‘మీండుమ్‌ మంజ పై విజిపునర్వు ఇయక్కం’ అంటే పసుపు పూసిన బట్ట సంచులు వాడదాం అని అర్థం. ఈ స్లోగన్‌తో  2019లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు క్యాంపెయిన్‌ ప్రారంభించింది ఐఎఎస్ ఆఫీసర్‌‌ సుప్రియా సాహు. ప్లాస్టిక్‌ నియంత్రణకు ఆమె చేస్తున్న పనికి తమిళనాడు ప్రభుత్వం కూడా సుప్రియకు మద్దతునిచ్చింది. ప్లాస్టిక్ బ్యాన్‌ చేసి, మంజపై సంచులను ప్రోత్సహించినా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ వాడకం ఆగలేదు. అయితే మంజపై సంచులు అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల కూడా ప్లాస్టిక్ వాడకం పెరుగుతుందని గ్రహించింది సుప్రియ. అందుకే మంజపై వెండింగ్‌ మెషిన్‌ అందుబాటులోకి తేవాలనుకుంది. అలా ఒక ప్రోటో టైప్‌ వెండింగ్‌ మెషిన్‌ తయారుచేయించింది. దీంట్లో పది రూపాయల బిళ్ల వేయగానే మీడియం సైజ్‌ ఉన్న పసుపు రంగు మంజ పై సంచి బయటకు వస్తుంది. వెండింగ్‌ మెషిన్‌ ట్రయల్‌ చేసిన వీడియోను తన ట్విట్టర్‌‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి ‘దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తమిళనాడు అంతటా అందుబాటులోకి తీసుకొస్తాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాం’ అని దాని కింద రాసింది సుప్రియ.   

ముప్పై మంది సభ్యులతో కలిసి పన్నెండు నెలల్లో దాదాపు 1,700 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్​ను సేకరించింది. 3,000 మంది పైగా పిల్లలను ఈ క్యాంపెయిన్‌లో భాగం చేసింది. 
వాళ్లకు కాలుష్యం మీద అవగాహన కలిపిస్తోంది. ‘ఈ పిల్లలే రేపు టార్చ్‌ బేరర్లుగా తయారవుతారు. భూమిని కాలుష్యం నుంచి రక్షిస్తారు’ అంటోంది సుప్రియ.