యెస్‌‌ బ్యాంక్‌‌కు మరో ఎదురుదెబ్బ

యెస్‌‌ బ్యాంక్‌‌కు మరో ఎదురుదెబ్బ
  • ఆడిట్ కమిటీ ఛైర్మన్ రాజీనామా
  • బోర్డు తీరుపై ఆరోపణలు
  • నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌‌కు లేఖ

న్యూఢిల్లీ :

యెస్‌‌ బ్యాంకులో కార్పొరేట్‌‌ గవర్నెన్స్‌‌ ప్రమాణాలు దిగజారుతుండటంతో   ఆడిట్‌‌ కమిటీ ఛైర్మన్‌‌, ఇండిపెండెంట్‌‌ డైరెక్టర్‌‌ పదవులకు ఉత్తమ్‌‌ ప్రకాష్‌‌ అగర్వాల్‌‌   రాజీనామా చేశారు. ఈ రెండింటితోపాటు ఇతర కమిటీల మెంబర్‌‌షిప్​ నుంచీ తక్షణమే  తప్పుకుంటున్నట్లు  ప్రకటించారు. ఇప్పటికే పీకల్లోతు కష్టాలలో కూరుకున్న యెస్‌‌ బ్యాంక్‌‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. సీఈఓ, ఎండీ రవ్‌‌నీత్‌‌ గిల్‌‌, సీనియర్‌‌ గ్రూప్‌‌ ప్రెసిడెంట్‌‌ రాజీవ్‌‌ ఒబెరాయ్‌‌, లీగల్‌‌ హెడ్‌‌ సంజయ్‌‌ నంబియార్‌‌ల పనితీరుపై అగర్వాల్‌‌ విమర్శలు గుప్పించారు. యెస్‌‌ బ్యాంక్‌‌ కార్యకలాపాలను పై అధికారులు, బోర్డు నిర్వహిస్తున్న తీరు సక్రమంగా లేదంటూ ఆరోపించారు. యెస్‌‌ బ్యాంక్‌‌ ప్రయోజనాలతోపాటు, లక్షల మంది డిపాజిటర్లను దృష్టిలో పెట్టుకుని తనకున్న ఆందోళనను చాలాసార్లు వారి ముందు ఉంచినప్పటికీ, ఎలాంటి మార్పూ రాలేదని వాపోయారు. తన బాధ్యతలను నెరవేర్చడానికి చేయని ప్రయత్నమంటూ లేదని నాన్‌‌–ఎగ్జిక్యూటివ్‌‌ పార్ట్‌‌టైమ్‌‌ ఛైర్మన్‌‌ బ్రహ్మ్‌‌ దత్‌‌కు రాసిన లెటర్‌‌లో అగర్వాల్‌‌ పేర్కొన్నారు. తాను రాజీనామా ఇస్తున్నప్పటికీ, భవిష్యత్‌‌లోనైనా యెస్‌‌ బ్యాంకు మళ్లీ కోలుకుని, పుంజుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

నాన్‌‌–ఎగ్జిక్యూటివ్‌‌ ఛైర్మన్‌‌కే కాకుండా మరి కొంత మంది సీనియర్‌‌ అధికారులకూ ఆయన లెటర్లు రాశారు. వారి నాయకత్వంలో బ్యాంకు భవిష్యత్‌‌ మెరుగుపడాలనే ఆకాంక్షను అగర్వాల్‌‌ వ్యక్తం చేశారు. యెస్‌‌ బ్యాంక్‌‌ విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ జనవరి 9 నాడు సెబీ ఛైర్మన్‌‌ అజయ్‌‌ త్యాగికి  మరో లెటర్‌‌నూ ఉత్తమ్‌‌ ప్రకాష్‌‌ అగర్వాల్‌‌ రాశారు.  ఉత్తమ్‌‌ ప్రకాష్‌‌ అగర్వాల్‌‌ వృత్తిరీత్యా ఛార్టర్డ్‌‌ అకౌంటెంట్‌‌. అక్టోబర్‌‌ 31, 2019 మీటింగ్‌‌లో ఒక గ్లోబల్‌‌ ఇన్వెస్టర్‌‌ 1.2 బిలియన్‌‌ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని బోర్డుకు సీఈఓ, ఎండీ మౌఖికంగా తెలియచేశారని సెబీ ఛైర్మన్‌‌కి రాసిన లెటర్లో అగర్వాల్‌‌ ప్రస్తావించారు.  ఐతే, పెట్టుబడి ప్రతిపాదన కోసం బోర్డు మీటింగ్‌‌ అసలు పెట్టనేలేదని ఆ లెటర్లో అగర్వాల్‌‌ వ్యాఖ్యానించారు. సీఈఓ, ఎండీ అయిన గిల్‌‌ ఆ ఇన్వెస్టర్‌‌ ఎవరనేది మాత్రం ఆ మీటింగ్​లోనూ బయటపెట్టలేదని, ఇందుకు కారణాలేమిటో ఆయనకు మాత్రమే తెలుసని అగర్వాల్‌‌ పేర్కొన్నారు. అక్టోబర్‌‌ 31, 2019 నాటి ప్రెస్‌‌ రిలీజ్‌‌ ప్రకారం సీఈఓ, ఎండీ చేతికి వచ్చిన బైండింగ్‌‌ ఆఫర్ వివరాలూ తమకు ఆ మీటింగ్‌‌లో వెల్లడి చేయలేదని వాపోయారు. దీంతో కొంత మంది వ్యక్తులు  సమాచారాన్ని తమకు నచ్చిన రీతిలో వక్రీకరించి, ఇన్వెస్టర్ల డెసిషన్‌‌ను ప్రభావితం చేయాలని చూసినట్లు కూడా అగర్వాల్‌‌ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఆ కాలంలో షేర్ల ట్రేడింగ్‌‌లో ప్రయోజనం పొందేందుకూ ఆ వ్యక్తులు ప్రయత్నించి ఉండొచ్చని విమర్శిస్తున్నారు. ఉత్తమ్‌‌ ప్రకాష్‌‌ అగర్వాల్‌‌ రాజీనామా నేపథ్యంలో యెస్‌‌ బ్యాంక్‌‌ షేర్‌‌ శుక్రవారం ట్రేడింగ్‌‌లో 4.86 శాతం పతనమై రూ. 45 కి చేరింది.

10 వేల కోట్ల సేకరణకు ఓకే…

డెట్, ఈక్విటీ ద్వారా రూ.10 వేల కోట్ల వరకు ఫండ్స్‌‌‌‌ను సేకరించేందుకు యెస్ బ్యాంక్ బోర్డు శుక్రవారం ఆమోదించింది. ఎర్విన్ సింగ్ బ్రైచ్/ఎస్‌‌‌‌పీజీపీ హోల్డింగ్‌‌‌‌ నుంచి వచ్చే ఆఫర్‌‌‌‌‌‌‌‌ను బోర్డు తిరస్కరించింది. అయితే సిట్యాక్స్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఆఫర్‌‌‌‌‌‌‌‌ను మాత్రం వచ్చే రౌండ్‌‌‌‌లో పరిశీలిస్తామని యెస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో పేర్కొంది. ఒకటి లేదా మూడు దశల్లో క్విప్(క్వాలిఫైడ్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ప్లేస్‌‌‌‌మెంట్), ఎఫ్‌‌‌‌సీసీబీ (ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్), జీడీఆర్‌‌‌‌ (గ్లోబల్​ డిపాజిటరీ రిసిప్ట్)‌‌‌‌ ద్వారా ఫండ్స్‌‌‌‌ను సేకరించాలని బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. షేర్‌‌‌‌‌‌‌‌ సేల్ ద్వారా సుమారు 200 కోట్ల డాలర్లను సేకరించనున్నామని యెస్ బ్యాంక్ గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో ప్రకటించింది. దీనిలో 120 కోట్ల డాలర్లను కెనడియన్ బిలీనియర్ ఎర్విన్ సింగ్ బ్రైచ్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ కూడా ఉన్నట్టు తెలిపింది. సిట్యాక్స్ హోల్డింగ్స్, సిట్యాక్స్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ గ్రూప్‌‌‌‌ వంటి ఇతర ఇన్వెస్టర్లు కూడా తమ బ్యాంక్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయనున్నారని పేర్కొంది. కానీ ఎర్విన్‌‌‌‌ సింగ్ సామర్థ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

YES Bank audit committee chief quits, says Gill misled on capital raising