కొంతమందికి తక్కువ తిన్నా సరిగా జీర్ణం కాక యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటివాళ్లు తిన్న తరువాత యోగా చేస్తే ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు అంటున్నారు యోగా ఇన్‌స్ట్రక్టర్ నివేదిత జోషి.
సప్త బద్ధ కోణాసనం:
కింద కూర్చొని మోకాళ్లని కొంచెం వంచి, రెండు అరికాళ్లను జోడించాలి. తరువాత తొడల్ని దూరం జరిపి నిదానంగా వెనక్కి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ మెరుగుపడి జీర్ణ సమస్యలు పోతాయి. అంతేకాదు అలసట, నిద్రలేమి కూడా ఉండవు.
ఊర్ధ్వ ప్రసరిత పాదాసనం:
పొత్తికడుపులో కొవ్వు కరిగించ డానికి ఈ ఆసనం పనికొస్తుంది. అంతే కాకుండా వెన్ను, జీర్ణ సమస్యలను పోగొడుతుంది. శవాసనంలో పడుకొని కుడికాలిని తొంబై డిగ్రీల్లోకి పైకి ఎత్తి ఉంచాలి. దానితరువాత అలానే ఎడమకాలిని కూడా చేస్తూ ఈ ఆసనాన్ని వేయాలి.
వజ్రాసనం:
ఈ ఆసనం వేయడంవల్ల పొట్టలో రక్త ప్రసరణ బాగా జరిగి మలబద్ధకం, కడుపులో ఏవైనా సమస్యలుంటే పోతాయి. అంతేకాకుండా ఒత్తిడి తగ్గి, మంచి నిద్రపడుతుంది. వజ్రాసనం ఎలా వేయాలంటే... మోకాళ్లవరకు వెనక్కు మడిచి పాదాలపై కూర్చోవాలి. వెన్ను నిటారుగా ఉంచి, చేతులను తొడలపై ఉంచాలి. గట్టిగా ఊపిరి పీల్చుతూ వదులుతూ ఈ ఆసనాన్ని వేయాలి.
సమస్థితి ఆసనం:
జీర్ణ క్రియ మెరుగు పడటంతో పాటు మెటబాలిజం పెంచుతుంది ఈ ఆసనం. ఇదెలా చేయాలంటే... రెండుకాళ్లను దగ్గరకు పెట్టి నిల్చోవాలి. వెన్ను, భుజాలు నిటారుగా ఉంచి చేతులు వదిలేసి కళ్లు మూసుకోవాలి.
