యోగ మన జీవన విధానం

యోగ మన జీవన విధానం

యోగ.. ఒక జ్ఞానం, ఒక మార్గం, ఒక చైతన్యం, ఒక ఆధ్యాత్మికం, ఒక వైద్యం. అంతేకాదు యోగ ఒక శాస్త్రబద్ధమైన జీవన విధానం. అలాంటి యోగ భారతీయ షడ్దర్శనాల్లో ఒకటి. దేశంలో క్రీ.పూ. 200 సంవత్సరాల కింద పతంజలి రచించిన యోగ నేడు విశ్వజనీనమై ప్రపంచంలోని సుమారు 180 దేశాలకు వ్యాప్తి చెందింది. వేదకాలం పూర్వమే వెలుగు చూసిన ఈ ప్రాచీన ప్రక్రియకు నేడు ప్రపంచ దేశాలు ప్రణమిల్లుతున్నాయి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. భారతీయ సంస్కృతిలో, ఆధ్యాత్మిక చింతనలో యోగాకు ప్రత్యేక స్థానముంది. హిందూ మతంలోనే కాదు, బౌద్ధం, జైనిజంలోనూ దాని  మూలాలు కనిపిస్తాయి. యోగ ఎంత ప్రాచీనమైనదంటే.. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతకు పూర్వమే పురుడుపోసుకుని, వికాసం పొందింది. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో యోగ, ప్రాణాయామం ప్రస్తావన ఇలా ఉంది..

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే 
ప్రాణాపానగతి రుధ్వా ప్రాణాయామపరాయణా : 
అపరే నియతాహారా: ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి

పీల్చే గాలిని వదిలే గాలిలో..వదిలే గాలిని పీల్చే గాలిలో హవనం చేసి, రెండు శ్వాసల్ని యోగ సాధకుడు తటస్థీకరిస్తాడు. అదే ప్రకారం ప్రాణశక్తిని గుండె నుంచి విడుదల చేసి ఆ ప్రాణశక్తిని అదుపులో ఉంచుకుంటాడు. ఆ యోగ విజ్ఞానాన్ని కృష్ణుడు సూర్యుడికి, ఆ సూర్యుడు కశ్యపుడికి, కశ్యపుడు మనువుకు, మనువు సూర్యవంశస్తుడైన ఇక్ష్వాకునికి బోధించినట్లు భగవద్గీత 4వ అధ్యాయం వివరిస్తుంది.

ప్రపంచానికి చాటిన రుషులు

పతంజలి యోగ శాస్త్రాన్ని 12వ శతాబ్దం వరకు మహర్షులు, యోగులు సాధన చేసి ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఆయా కాలాల్లో పతంజలి యోగ శాస్త్రంపై అనేక మంది మహర్షులు యోగ క్రియను విస్తృతం చేస్తూ రచనలు చేశారు. ‘యోగా వాసిష్ఠం’, ‘యోగ యజ్ఞవల్క’, ‘మహాభాష్యం’, ‘కుండలిని యోగ’, ‘క్రియా యోగ’.. వంటి అనేక గ్రంథాలు వెలుగు చూశాయి. 18, 19వ శతాబ్దంలో మత్యేంద్రనాథుడు, గోరక్షనాథుడు, స్వాత్మారామ యోగి, మహావతార్ బాబాజీ, మహర్షి యోగానంద, అరవిందుడు, దయానంద సరస్వతి వంటి వారు పతంజలి యోగ శాస్త్రాన్ని స్వయంగా సాధన చేయడమే కాకుండా, సామాన్యులకు బోధించారు. దేశంలో ప్రాచుర్యం పొందిన యోగను స్వామి వివేకానందుడు ప్రపంచంలోని ఇతర దేశాలకు తన ప్రసంగాల ద్వారా వ్యాప్తి చేశారు. ఆయన 1896లో అమెరికాలోని మన్‌‌హటన్ నగరంలో రాజయోగ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 37 సంవత్సరాలపాటు పాశ్చాత్య దేశాలలో పర్యటించిన మహర్షి యోగానంద ‘క్రియా యోగ’ వ్యాప్తికి చేసిన కృషి ప్రత్యేకమైంది. పతంజలి మహర్షి ‘యోగః చిత్తవృత్తి నిరోధ:’ అని పేర్కొంటారు. అంటే యోగ అనేది మనసులోని చంచలత్వాన్ని నిరోధించి, స్థిరంగా ఉండి సుఖాన్ని ఇచ్చే క్రియ. శరీర దారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకు, రోగనిరోధక శక్తికి ఆచరించే ప్రక్రియలను పతంజలి మహర్షి అష్టాంగ యోగంలో వివరించారు. అవి యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. ఈ అష్టాంగ యోగలో అహింస, చోర గుణాలను నిరసిస్తూ ప్రజ్ఞావంతుడు కోరికలను  జయించాలి. 

ఆరోగ్య వృద్ధికి సాధనం

పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగాల్లోని ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన ప్రక్రియలు ప్రస్తుత దైనందిన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. యోగాసనాలకు సంబంధించి సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని, ప్రతి జీవికి ప్రతీకగా ఒక్కొక్క భంగిమలో ఆసనం సృష్టించబడినట్లు యోగ శాస్త్రం చెబుతోంది. రుషులు వీటిని క్లుప్తపరచి 84 ఆసనాలను ఉపయోగంలోకి తీసుకువచ్చారు. అయితే, ఇందులో సిద్ధ, పద్మ, స్వస్తిక, సుఖాసనాలు ధ్యాన యోగానికి ఉపయోగిస్తే, మిగిలిన 80 ఆసనాలు మానవ శరీరంలోని అవయవాలకు శక్తినిచ్చేలా, ఉపయోగపడేలా క్రమ వరుసలో రూపొందాయి. నాలుగు విధాలుగా చేసే ఆసనాల్లో సాధకుడు నిటారుగా నిలబడి, కూర్చుని, వెల్లకిలా పడుకుని, బోర్లా పడుకుని వివిధ ఆసనాలను సాధన చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఆసనానికి ఒక ప్రత్యేక ప్రయోజనం కలుగుతుంది. యోగాసనాలు ముఖ్యంగా శారీర దారుఢ్యాన్ని, మానసిక వికాసాన్ని, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

సూర్య నమస్కారాలతో ఉత్తేజం

యోగ ప్రక్రియలో సామూహిక ఆసనాల స్వరూపమే సూర్య నమస్కారాలు. వేద పురాణాల్లో సూర్య నమస్కారాల ప్రస్తావన కనిపిస్తుంది. రావణాసురుడితో యుద్ధానికి తలపడే ముందు శ్రీరాముడికి అగస్త్య మహాముని సూర్య నమస్కారాలను బోధించాడట. అయితే.. 12 భంగిమలు, 12 మంత్రాలతో కూడిన ఈ ప్రక్రియలో ఒక సంక్షిప్తమైన వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం ఇమిడి ఉన్నాయి. ఈ సాధన వల్ల శరీరంలో ఉండే ప్రతి అవయవం ఉత్తేజితమై విష పదార్థాలను విసర్జిస్తుంది. శరీరంలో గ్రంథులు, అంతరంగిక గ్రంథులు, అంతస్రావాలు (హార్మోనులు) సమతుల్యం అవుతాయి. అంతేకాకుండా, పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి, కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పొందుతుంది. ఈ ప్రక్రియను సూర్యోదయం సమయంలో సూర్యుడికి అభిముఖంగా సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ప్రాణాయామం శక్తిమంతం

ఆసనాలు శరీరం మీద పట్టు సాధిస్తే, ప్రాణాయామం శ్వాస మీద పట్టు సాధిస్తుంది. శ్వాస ఆధీనంలో ఉన్నప్పుడు ప్రాణ శక్తి ఉద్దీపన చెంది, మనసును నియంత్రిస్తుంది. “ఇంద్రియాణాం దహ్యంతిదోషా: ప్రాణస్తనిగ్రహాత్’’..- అంటే మనిషిలోని దోషాలన్నీ పోయి ఆరోగ్యవంతులు కావాలంటే ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో ముఖ్యంగా నాలుగు దశలు ఉంటాయి. పూరకం (గాలి పీల్చే క్రియ), పూరక కుంభకం, రేచకం (గాలి వదిలే క్రియ), రేచక కుంభకం. వీటిని నియమిత సమయాన్ని అనుసరించి సాధన చేయాలి. ఇది శరీరంలోని అన్ని అవయవాలను ఉత్తేజితం చేసి, ఇంద్రియాలను శక్తిమంతం చేస్తుంది. ప్రాణవాయువు గొప్ప శక్తివంతమైందని శాస్త్రం చెప్తోంది.  ఒక ప్రాణి తాను తీసుకునే శ్వాస వేగం దాని జీవిత కాలాన్ని నిర్ణయిస్తుందట. ఒక తాబేలు ఒక నిమిషానికి 4 నుంచి -5 సార్లు గాలి పీల్చుకుని సుమారు 200 ఏండ్లు జీవిస్తుందట. మనిషి నిమిషానికి 16 సార్లు ఉపిరి పీల్చుకుంటూ 80 నుంచి 100 ఏండ్లు జీవిస్తాడు. అయితే.. ప్రాణాయామ క్రియ ద్వారా యోగ సాధకుడు 6 నుంచి 8 సార్లు శ్వాస తీసుకుని తమ ఆయుష్షును పెంచుకోవచ్చని రుషులు అనుభవ పూర్వకంగా వెల్లడించారు.

యోగా డేకు ప్రత్యేకత

ప్రధాని మోడీ 2014 సెప్టెంబర్​ 27న జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో పాల్గొని, యోగా గురించి చేసిన ప్రసంగం చారిత్రాత్మకమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “యోగా ప్రకృతిని, మనిషిని సంలీనం చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. యోగ ఒక ఆసనం మాత్రమే కాదు. శాస్త్రీయమైన ప్రక్రియ. యోగ సాధన ప్రకృతితో అనుసంధానం చేస్తూ, మనల్ని మనం తెలుసుకునేలా చేస్తుంది. యోగా ఆరోగ్యవంతుల్ని చేయడమే కాదు, మన జీవన విధానంలో గొప్ప మార్పును తెస్తుంది”అని వివరించారు. ‘యోగ దినోత్సవం’ జరపాలన్న మోడీ ప్రతిపాదనను 177 దేశాలు ఆమోదించాయి. ఏటా జూన్ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ జరపాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.  

కరోనా నియంత్రణలో యోగ

కరోనా సంక్షోభ కాలంలో యోగా ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు గుర్తించాయి. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు యోగా ఎంతో తోడ్పడుతుంది. కరోనా ప్రధానంగా మనిషి రోగ నిరోధక శక్తిపై దాడి చేస్తుంది. ఈ సమయంలో వైరస్ పై పోరాడేందుకు రోగనిరోధక శక్తి ఎంతో అవసరం. యోగాలోని ప్రాణాయామ ప్రక్రియ మనిషిలో రోగనిరోధక కణాలను పెంచుతుంది. శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, మెదడుపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు యోగాసనాలతోపాటు, ప్రాణాయామాన్ని క్రమ పద్ధతిలో సాధన చేయడం వల్ల ఉపిరితిత్తులు బలపడతాయి. రక్తప్రసరణ ఉత్తేజితమవుతుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. మనం చేసే ప్రాణాయామం వల్ల శరీరానికి పూర్తి స్వస్థత కలుగుతుంది. మన జీవశైలిని సులభతరం చేసేందుకు యోగా అద్భుత మార్గం. యోగా కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా దృఢతరం చేస్తుంది. యోగాను దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయన్న వాస్తవాన్ని యావత్ ప్రపంచం గుర్తించింది.

- డా. జి. విజయ్ కుమార్ జీ
సీనియర్ స్టాఫ్ ఆర్టిస్ట్