జనం మార్పు కోరుకుంటున్నరు : యోగేందర్ యాదవ్

జనం మార్పు కోరుకుంటున్నరు : యోగేందర్ యాదవ్
  •    రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం 

 ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్,  పొలిటికల్ యాక్టివిస్ట్  ప్రొ.యోగేందర్  యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో  పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ హవా నడుస్తున్నదని తెలిపారు.  బీఆర్ఎస్ అండతో  బీజేపీ తెలంగాణలో  పాగా వేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యిందన్నారు. బీజేపీకి తెలంగాణలో అన్ని దారులు మూసుకుపోయాయని చెప్పారు. 

పదేండ్లు  అవకాశం ఇచ్చినా బీఆర్ఎస్ వినియోగించుకోలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు వివరించారు. దశాబ్దాలుగా  ప్రజల సమస్యలపై పనిచేస్తున్న ప్రజా సంఘాలు, ఉద్యమ నేతలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. వారి మద్దతుతో  తెలంగాణలో  కాంగ్రెస్  గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో వచ్చిన మార్పే..  2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వస్తుందన్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024లో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించినప్పుడే దేశంలో  ప్రజాస్వామ్యాన్ని  రక్షించుకున్నట్టు  అవుతుందని యోగేందర్  పేర్కొన్నారు.  సమావేశంలో భారత్ జూడో  అభియాన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సుకుమార్, పంకజ్ పుష్కర్, విస్సా కిరణ్, జహీర్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.