గగన్‌యాన్‌ మిషన్:హ్యూమన్-రేటెడ్ HLVM3 టెస్టింగ్ విజయవంతం: జితేంద్ర సింగ్

గగన్‌యాన్‌ మిషన్:హ్యూమన్-రేటెడ్ HLVM3 టెస్టింగ్ విజయవంతం: జితేంద్ర సింగ్

భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమం గగన్‌యాన్ హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ (HLVM3) అభివృద్ధి ,గ్రౌండ్ టెస్టింగ్ ఇప్పటికే పూర్తయిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం(జూలై 23) అన్నారు.

HLVM3 ఇస్రో అత్యంత శక్తివంతమైన రాకెట్ అయిన లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM3) మానవ-రేటెడ్ వెర్షన్. ఈ LVM3 రాకెట్‌ను మానవ సహిత మిషన్ల కోసం ప్రత్యేకంగా మార్పులు చేసి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు.

ప్రధాన విజయాలు, టెస్టింగ్‌లు:

HLVM3 అభివృద్ధి గ్రౌండ్ టెస్టింగ్‌లు పూర్తిగా పూర్తయ్యాయి. ఇది భవిష్యత్ మానవ సహిత మిషన్ల కోసం వాహనం సంసిద్ధతను నిర్ధారిస్తుంది. 
ప్రొపల్షన్ సిస్టమ్స్: క్రూ మాడ్యూల్ (Crew Module) ,సర్వీస్ మాడ్యూల్ (Service Module) రెండింటికీ సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్స్ అభివృద్ధి చేశారు. విజయవంతంగా పరీక్షించారు. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ (SMPS) కు సంబంధించి ఇస్రో ఇటీవల (జూలై 2025లో) రెండు హాట్ టెస్ట్‌లను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలు ఇంజిన్లు వాస్తవ పరిస్థితులలో ఎలా పని చేస్తాయో పరీక్షించింది. 

క్రూ ఎస్కేప్ సిస్టమ్ (CES): వ్యోమగాముల భద్రతకు అత్యంత కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ (CES) కింద 5 రకాల మోటార్లను అభివృద్ధి చేసి స్టాటిక్ టెస్టులు చేశారు. ఈ వ్యవస్థ అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను సురక్షితంగా బయటపడేలా చేస్తుంది.

టెస్ట్ వెహికల్ ఫ్లైట్స్: CES పనితీరును ధృవీకరించేందుకు ఓ టెస్ట్ వెహికల్ (TV-D1) ను అభివృద్ధి చేసి విజయవంతంగా పరీక్షించారు. TV-D2 ,ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-01) కోసం పనులు కొనసాగుతున్నాయి.

మౌలిక సదుపాయాలు: ఆర్బిటల్ మాడ్యూల్ ప్రిపరేషన్ ఫెసిలిటీ, గగన్‌యాన్ కంట్రోల్ సెంటర్, గగన్‌యాన్ కంట్రోల్ ఫెసిలిటీ, క్రూ ట్రైనింగ్ ఫెసిలిటీ ,రెండవ లాంచ్ ప్యాడ్ మార్పులతో సహా అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. 

ఫ్లైట్ ఆపరేషన్స్ ,కమ్యూనికేషన్ నెట్‌వర్క్: గ్రౌండ్ నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్ సిద్దం అయింది. IDRSS-1 ఫీడర్ స్టేషన్లు ,టెరెస్ట్రియల్ లింకులు కూడా రెడీ అయ్యాయి. 

క్రూ రికవరీ ఆపరేషన్స్: రికవరీ ప్రాపర్టీస్ కూడా సిద్దం చేశారు. రికవరీ ప్లాన్ కూడా రూపొందించారు. 

క్రూ మాడ్యూల్: క్రూ మాడ్యూల్ (CM) ,సర్వీస్ మాడ్యూల్ (SM) నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. క్రూ మాడ్యూల్ ఫేజ్-1 చెకింగ్స్ కూడా పూర్తయ్యాయి.

గగన్‌యాన్ మిషన్ లక్ష్యం

గగన్‌యాన్ మిషన్ ప్రధాన లక్ష్యం ముగ్గురు భారతీయ వ్యోమగాములను 3 రోజుల పాటు భూమి దిగువ కక్ష్య (Low Earth Orbit - LEO) కు 400 కిలోమీటర్ల ఎత్తులో పంపి, తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావడం. 

►ALSO READ | బ్యాటరీలను తానే మార్చుకున్న హ్యూమనాయిడ్ రోబో

ఈ మిషన్ తో యుఎస్ఏ, రష్యా, చైనా తర్వాత భారతదేశానికి మానవ సహిత అంతరిక్ష యాత్ర సామర్థ్యం ఉన్న నాల్గవ దేశంగా గుర్తింపు రానుంది.  ఈ విజయాలు గగన్‌యాన్ మిషన్ మొదటి మానవరహిత ప్రయోగానికి (G1) ,తదుపరి మానవ సహిత మిషన్లకు మార్గం సుగమం చేస్తాయి.