
ఏ యాక్టర్‌కి అయినా ఒక్క సినిమాతోనే గుర్తింపు లభిస్తుంది. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా మళ్లీ అలాంటి సక్సెస్, ఆడియెన్స్ మీద ఇంపాక్ట్ చూపించే పాత్రలు ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ కన్నడ బ్యూటీ మాత్రం చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రతీది ప్రత్యేకంగా ఉంటుంది. ఏ సినిమాలో చూసినా తన పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. తనెవరో కాదు.. శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath).
లీడ్ రోల్, నెగెటివ్ రోల్ అని కూడా చూసుకోకుండా కేవలం పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే మదర్ రోల్ అయినా ఓకే అంటుంది. అలానే తెలుగులో నేషనల్ అవార్డ్ ఫిల్మ్ ‘జెర్సీ’లో తల్లిపాత్రలో కనిపించి ఆకట్టుకుంది. పలు భాషల్లో రకరకాల పాత్రలు చేస్తూ అలరిస్తోన్న శ్రద్ధా జర్నీ విశేషాలివి.
శ్రద్ధా శ్రీనాథ్.. జమ్మూకశ్మీర్‌లోని ఉధమ్పూర్లో నివసించే కన్నడ ఫ్యామిలీలో పుట్టింది. ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్, తల్లి స్కూల్ టీచర్. శ్రద్ధ సికింద్రాబాద్‌లోని ఆర్మీ స్కూల్లో చదువుకుంది. తర్వాత బెంగళూరులో ఆమె లీగల్ స్టడీస్ పూర్తి చేసింది. లా చదువు పూర్తయ్యాక అక్కడే రియల్ ఎస్టేట్ లాయర్‌గా పనిచేసింది.
ఆ తర్వాత ఒక ఫ్రెంచ్ రిటైల్ కంపెనీలో రియల్ ఎస్టేట్ లీగల్ అడ్వైజర్‌గా చేరింది. ఫుల్ టైం కార్పొరేట్ జాబ్ చేస్తూనే నాటకాల్లో నటించేది. అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్స్లో కనిపించేది. 2015లో వచ్చిన ‘కోహినూర్’ అనే మలయాళ సినిమాలో సెకండ్ ఫీమేల్ లీడ్‌గా నటించేందుకు ఆమెకు ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ది గేమ్ : యు నెవర్ ప్లే ఎలోన్’ అనే వెబ్ సిరీస్ వచ్చే నెలలో రిలీజ్ కాబోతోంది.
ఫ్రెండ్ వల్ల..
చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. చదువుకునే టైంలో మా ఫ్రెండ్స్‌కు ‘యాక్టింగ్ చేయాలనుంది. కానీ ఎలా వెళ్లాలో తెలియదు’ అని చెప్తూ ఉండేదాన్ని. వాళ్లు కూడా విని విని విసిగిపోయారు.
ఒకరోజు మా ఫ్రెండ్ ఫేస్బుక్లో మూవీ ఆడిషన్స్ అడ్వర్టైజ్మెంట్ చూసి, నాకు చెప్పకుండానే నా పేరు రిజిస్టర్ చేసింది. తర్వాత ఆడిషన్ కాల్ రావడంతో నా దగ్గరకొచ్చి, ‘నువ్వు ఈ ఆడిషన్‌కు అటెండ్ అవ్వు. నేనే రిజిస్టర్ చేశా. నువ్వు లైఫ్ అంతా మనసులో పెట్టుకోవడం కంటే ఈ ఆడిషన్‌కు వెళ్లడం మంచిదని’’ చెప్పింది. అలా నేను నా మొదటి ఆడిషన్‌కు వెళ్లాను.
అయితే, సెలక్ట్ అవుతానని మాత్ర ఊహించలేదు. అలా నా యాక్టింగ్ జర్నీ స్టార్ట్ అయింది. బి.ఎ ఎల్ఎల్బీ చదువుతున్న రోజుల్లోనే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసే చాన్స్ వచ్చింది. మార్నింగ్ రిహార్సల్ చేశాక ఆఫీస్‌కు వెళ్లేదాన్ని. తిరిగొచ్చాక రాత్రిపూట మళ్లీ రిహార్సల్స్ చేసేదాన్ని. అయితే ఇండస్ట్రీకి మాత్రం అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాను. ఒక్క మూవీ చేస్తే గొప్ప అనుకున్నా. ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని కంగారు పడ్డా. కానీ నాకు దక్కిన గౌరవం, అభిమానం చూసి ఆశ్చర్యపోయాను.
ఫ్రెష్‌గా ఉండే క్యారెక్టర్స్:
తెలుగులో ఫస్ట్ సైన్ చేసిన సినిమా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. తర్వాత ‘జోడి’, మూడోది ‘జెర్సీ’. కానీ మొదట రిలీజ్ అయింది మాత్రం ‘జెర్సీ’నే. ఆ సినిమాలో మదర్ పాత్ర చేయడం వల్ల తర్వాత నుంచి అలాంటి ప్రాజెక్ట్‌లే వచ్చాయి. పైగా అవి అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ కాదు. అందుకే నేను వాటిని ఒప్పుకోలేదు. నాకు కొత్తగా, ఫ్రెష్‌గా ఉండే క్యారెక్టర్స్ చేయాలని ఎదురుచూశాను. అందుకే మెకానిక్ రాకీ, డాకు మహారాజ్ వంటి సినిమాలు వచ్చేవరకు ఆగా.
ఇండిపెండెన్స్ డే:
ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ కావడం వల్ల ప్రతి రెండేండ్లకు ఒకసారి కొత్త ప్లేస్‌కు వెళ్లేవాళ్లం. నాకు అది ఎగ్జయింట్‌గా అనిపించింది. వెళ్లిన ప్రతి చోట కొత్త వాళ్లతో కలిసి ఉండడం ఆ ఎక్స్‌పీరియెన్స్ బాగా నచ్చేది. మిగతావాళ్లు ఎందుకు ఎప్పుడూ ఒకేచోట ఉంటారు? అప్పుడప్పుడు మాలాగే షిప్ట్ అవుతూ ఉంటే బాగుంటుంది కదా అనిపించేది.
నేను నా సిస్టర్ చిన్నప్పటి నుంచి మా నాన్న దేశం కోసం ఎంత కమిట్మెంట్తో పనిచేస్తున్నారో చూస్తూ పెరిగాం. అమ్మ సోల్జర్స్ చేసే త్యాగాల గురించి చెప్తూ ఉండేది. వాళ్ల వల్లే మనం స్వేచ్చగా బతుకుతున్నాం అని చెప్పేది. ఇండిపెండెన్స్ డే మాకు చాలా స్పెషల్. ఆరోజు ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ విని, పరేడ్ చూసేవాళ్లం.
ఆనందంగా ఉంది:
నాకు సక్సెస్ వస్తే స్టార్ అవుతారని, ఫెయిల్యూర్ వస్తే కిందకి పడిపోతారని నేను అనుకోను. ఒకేసారి పది సినిమాలు చేస్తూ బిజీగా గడపాలని నేను అనుకోవట్లేదు. ఒక ఇండస్ట్రీలో చాలాకాలంగా ఉంటున్నప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేయాలి లేకపోతే హైప్ తగ్గుతుంది. ‘యూ టర్న్’ రిలీజ్ అయినప్పుడు చాలామంది ‘ఎవరీ అమ్మాయి? ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదే’ అనుకున్నారు. కానీ, నాకు ఒక్కసారిగా స్టార్డమ్ మాత్రం రాలేదు.
ఈ జర్నీలో నా గ్రాఫ్ నెమ్మదిగా, స్థిరంగా పెరుగుతూ వచ్చింది. అందుకు నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు ఓటీటీల్లోనూ నటిస్తున్నాను. ఓటీటీల వల్ల చాలామందికి అవకాశాలు వస్తున్నాయి. ఇక్కడ సూపర్ స్టార్స్ ఎవరూ ఉండరు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి సీజన్లు ఉంటాయి. యాక్టర్‌గా ఒక సీజన్ నుంచి మరో సీజన్‌కు బెటర్ పర్ఫార్మెన్స్ చూపించేందుకు స్కోప్ ఉంటుంది. ఓటీటీ ప్రాజెక్ట్స్‌లో చేయడం నాకు ఎగ్జయిటింగ్‌గా ఉంది.