Pawan Kalyan : నేను పవన్.. అంతా ఉంటా.. "హరిహర వీరమల్లు" ప్రీ-రిలీజ్ వేడుకలో విమర్శకులకు చురకలు

Pawan Kalyan : నేను పవన్.. అంతా ఉంటా.. "హరిహర వీరమల్లు" ప్రీ-రిలీజ్ వేడుకలో విమర్శకులకు చురకలు

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా 'హరిహర వీరమల్లు' (  Hari Hara Veera Mallu ) విడుదల కానుంది. ఈ  పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ ప్రీ-రిలీజ్ వేడుక విశాఖపట్నంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన కెరీర్, వ్యక్తిగత జీవితం, సినిమా మేకింగ్, రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విశాఖతో అవినాభావ సంబంధం!
 విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. నటనలో ఓనమాలు ఇక్కడే దిద్దుకున్నానని తెలిపారు. నా గురువు సత్యానంద్‌ ఉత్తరాంధ్ర ఆటాపాటను నా గుండెల్లో అణువణువునా నింపేశారు. ఆయన వద్ద నటన కాదు.. ధైర్యాన్ని నేర్చుకున్నా. ఆయన నాకు జీవిత పాఠాలు నేర్పారు" అని కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడ పెరిగాను అంటారని కొందరు విమర్శిస్తుంటారని, వారంతా కూపస్థమండూకాలని, అంతకు మించి ఆలోచించలేరని తీవ్రంగా చురకలంటించారు. నా పేరు పవన్. అంతా ఉంటాను అంటూ తన ఉనికిని నొక్కి చెప్పారు.  ఈ సందర్భంగా ఈ సినిమాలో పాట పాడి అభిమానులను ఉత్సాహాన్ని నింపారు.

సినిమాల పట్ల ఆసక్తి
  సినిమాలు చేయాలని, డబ్బులు సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదు. అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలని అనిపించేదని పవన్ చెప్పారు.  ఒక అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నప్పుడు ధైర్యంగా చెప్పాలని సత్యానంద్‌ నేర్పించారు. అన్నయ్య, వదినలు నన్ను నమ్మారు. వాళ్లే నాకు కనిపించే దైవాలు అంటూ చిరంజీవి, సురేఖల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. నటన కన్నా కూడా నాకు సినిమా మేకింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. నేను ఏ సినిమా చేసినా ఒక టెక్నీషియన్‌గా ఆలోచిస్తా. అందుకే నిజ జీవితంలో ఏం చేయగలనో అదే నా సినిమాల్లో చేస్తా" అని స్పష్టం చేశారు.

'హరిహర వీరమల్లు' ప్రయాణం
'హరిహర వీరమల్లు' సినిమా గురించి మాట్లాడుతూ, దర్శకుడు క్రిష్‌ను పవన్ ప్రత్యేకంగా అభినందించారు. మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామంటే దర్శకుడు క్రిష్‌ కారణం. ఆయనే ఈ కథను తీర్చిదిద్దారు. అంతేకాదు30 శాతం షూటింగ్‌ కూడా ఆయనే పూర్తి చేశారు అని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా, జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. నేను చేయాల్సిన పని మాత్రమే చేస్తా. ఫలితం దేవుడికి వదిలేస్తా అని తెలిపారు.  ఫిల్మ్‌ మేకింగ్‌కు కుల, మతాలు లేవు. మేమంతా మీకు ఆనందం కలిగించడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి నేను ఈ సినిమా మేకింగ్‌ విషయంలో భయపడుతూ ఉండేవాడిని. ప్రేక్షకులను అలరిస్తుందా? అని అనుకునేవాడిని. కానీ, క్రిష్‌ టీజర్‌ విడుదల చేసి వాటిని పటాపంచలు చేశారు అని చెప్పుకొచ్చారు.

కీరవాణి మాయాజాలం
ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సినిమాకు వెన్నెముక అని పవన్ నొక్కి చెప్పారు. ఆయన లేకపోతే, ‘హరిహర వీరమల్లు’ మూవీ లేదు. మేమెంత బాగా చేసినా, దానిని ముందుకు తీసుకెళ్లే నేపథ్య సంగీతం, పాటలు లేకపోతే మూవీ ఆకట్టుకోదు. అకాడమీ అవార్డు విన్నర్‌ మనతో కలిసి ప్రచారం చేస్తున్నారంటే అది మన అదృష్టం. ‘నాటు నాటు’ యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షించిందంటే, అందుకు చంద్రబోస్‌ సాహిత్యం, కీరవాణి సంగీతం కారణం అని కొనియాడారు.

"‘ఖుషి’ తర్వాత 'హరిహర వీరమల్లు' సినిమా పూర్తిగా చూశానని చెప్పారు. ప్రజా కంటకుడైన ఔరంగజేబు తీసుకెళ్లిపోయిన కోహినూర్‌ వజ్రాన్ని తీసుకురావడమే ఈ కథ. సనాతన ధర్మం అంటే, ఏ మతానికీ వ్యతిరేకం కాదు. అందరినీ కలిపేది అని వెల్లడించారు.  అందరి హీరోల్లాగే తన మూవీకి టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు, ఈ మూవీ విజయం సాధించాలని పోస్ట్ చేసిన మంత్రి నారా లోకేశ్‌కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు

 

మన చరిత్రలో ఎంతో మంది గొప్పరాజులు ఉన్నా, మొగలుల గురించి ఎక్కువగా చెప్పారు. బలమైన శరీరంతో పాటు, మనసు కూడా ఉండాలి. అందుకే మార్షల్‌ ఆర్ట్స్‌ను నమ్ముతాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని పవన్ కళ్యాణ్ అన్నారు. పబ్లిసిటీ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం అలవాటైపోయింది. నా మొదటి సినిమా నుంచి ఏదో ఆడియో విడుదల వేడుక తప్పితే, రండి నా సినిమా చూడండి అని ఎప్పుడూ అడగలేదు. నాకు ఇవ్వటమే తెలుసు కానీ, నేను అడగక్కర్లేదు. అభిమానులైన మీరు అన్నీ ఇస్తారని నాకు తెలుసు అని పేర్కొన్నారు. ఈ వేడుక 'హరిహర వీరమల్లు'పై అంచనాలను మరింత పెంచింది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డును సృష్టిస్తుందో చూడాలి ..