యోగి వద్ద కోటిన్నర ఆస్తులు, రివాల్వర్‌‌, రైఫిల్

యోగి వద్ద కోటిన్నర ఆస్తులు, రివాల్వర్‌‌, రైఫిల్

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పోటీ చేస్తున్నారు. గతంలో వరుసగా ఐదు సార్లు గోరఖ్‌పూర్‌‌ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ఈ సారి గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. శుక్రవారం ఆయన, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి వెళ్లి కలెక్టర్ ఆఫీసులో తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నామినేషన్ పత్రంలో ఆస్తులు, తన దగ్గర ఉన్న ఇతర వస్తువుల వివరాలతో అఫిడవిట్ ఫైల్ చేశారు. ఇందులో తన వద్ద ఉన్న డబ్బు, ఆరు బ్యాంకు అకౌంట్లలో ఉన్న సొమ్ముతో కలిపి కోటి 54 లక్షల 94 వేల 54 రూపాయలు ఉన్నట్లు యోగి పేర్కొన్నారు. 

శాంసంగ్ ఫోన్, గోల్డ్ చెయిన్‌, రుద్రాక్ష మాల..

డబ్బుతో పాటు తన వద్ద ఉన్న వేర్వేరు వస్తువులు వివరాలను కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.12 వేల విలువైన శాంసంగ్ ఫోన్‌, లక్ష రూపాయలు ఖరీదు చేసే రివాల్వర్, రూ.80 వేల ఖరీదు ఉండే రైఫిల్ తన వద్ద ఉన్నాయని తెలిపారు. అలాగే బంగారు ఇయర్ రింగ్, గోల్డ్ చెయిన్, రుద్రాక్ష మాల ఉన్నట్లు చెప్పారు. అలాగే తన పేరు ఎటువంటి భూములు, వాహనాలు లేవని, అప్పులు కూడా లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని వివరించారు.

సీఎం అయ్యాక ఏటా ఆదాయ వివరాలు..

యోగి సీఎం అయ్యాక ప్రతి ఏటా తన ఆదాయం ఎంతేంత ఉందన్న వివరాలనూ నామినేషన్‌తో పాటు ఫైల్‌ చేసిన అఫిడవిట్‌లో వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాది (2017–18 ఆర్థిక సంవత్సరంలో) తన ఆదాయం రూ.14,38,670 అని తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 18 లక్షల 27 వేల 639 రూపాయలు,  2019–20లో 15 లక్షల 68 వేల 799 రూపాయలు, 2020–21లో 13 లక్షల 20 వేల 653 చొప్పున తన ఆదాయం ఉన్నట్లు యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంకా ముగియకపోవడంతో ఈ ఏడాది ఆదాయం ఎంతన్నది వెల్లడించలేదు.

తొలిసారి ఎమ్మెల్యే పదవికి పోటీ

కాగా, 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌‌ ఎంపీగా గెలిచారు. అయితే 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో ఆ పార్టీ పెద్దలు.. యోగిని సీఎంగా ఎంపిక చేశారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు  చేపట్టిన ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2017 సెప్టెంబర్ 9న ఆయన యూపీ శాసన మండలికి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న యోగి.. తొలిసారిగా ఈ ఎన్నికల్లోనే ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయకుంటే నిరసన కాదా?

కశ్మీర్‌‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

పీవీని ఓడించిన బీజేపీ నేత మృతి..తెలుగులో మోడీ సంతాపం