జైపూర్: సరిహద్దులు, ప్రజలను ఎలా రక్షించుకోవాలో కొత్త భారత్ కు తెలుసని ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అన్నారు. టెర్రరిస్టులను చంపడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల మరణాల వెనుక భారత ఇంటెలిజెన్స్ సంస్థల హస్తం ఉందంటూ బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్’ పత్రిక కథనాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజస్థాన్ లోని భరత్ పూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. “పాకిస్తాన్కు చెందిన 20 మంది టెర్రరిస్టులు చనిపోయారని బ్రిటన్ కు చెందిన ఓ వార్తా పత్రిక మూడ్రోజుల క్రితం తెలిపింది.
వీరిని ఇండియా చంపే అవకాశం ఉందని చెప్పింది. నిన్నటి వరకు టెర్రరిస్టులకు షెల్టర్ ఇచ్చిన వారు ఇప్పుడు వైమానిక దాడుల భయంతో భారత్ పై ఏమీ మాట్లాడే సాహసం చేయడం లేదు. ఆ రిపోర్టుకు ఆధారం ఏమిటో మాకు తెలియదు. కానీ, ఇది కొత్త భారత్. సరిహద్దులను ఎలా రక్షించుకోవాలో, ప్రజలకు ఎలా భద్రతను కల్పించాలో దీనికి తెలుసు”అని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ను ప్రపంచం గౌరవిస్తోందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. విదేశాలకు భారతీయుడు వెళ్లినప్పుడు అతడికి గౌరవం లభిస్తుందని చెప్పారు. సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. టెర్రరిజం, అతివాదం, నక్సలిజం అంతమయ్యాయని వెల్లడించారు.