Summer Fruits : పుచ్చకాయ, రేగిపండ్లు.. కడుపులో చల్లగా వడ దెబ్బ నుంచి రక్షణ..!

Summer Fruits : పుచ్చకాయ, రేగిపండ్లు.. కడుపులో చల్లగా వడ దెబ్బ నుంచి రక్షణ..!

ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తింటే రుచికి రుచి... ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎండాకాలంలో స్పెషల్ గా దొరికే ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని శరీరాన్ని చల్లబరుస్తాయి. మరికొన్ని ఈ కాలంలో వచ్చే పలు వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇంకొన్ని పోషకాలు అందిస్తాయి. శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. అందుకే, సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి.

వేసవి తాపాన్ని తట్టుకుని, కాస్త కూల్గా ఉండాలంటే.. ఈ కాలంలో వచ్చే వడదెబ్బ, చికెన్ ఫాక్స్, విరేచనాలు.. లాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే.. నీరసం రాకండా, తక్షణ శక్తి పొందాలంటే.. ఎండాకాలంలో దొరికే అన్ని రకాల పండ్లు తినాల్సిందే. అయితే, వాటిలో ఏఏ రకాల ప్రొటీన్స్ ఉన్నాయి? ఏఏ వ్యాధులు రాకుండా కాపాడతాయి? అసలు ఎండాకాలంలో దొరికే ఫ్రూట్స్ ఏంటి? ఎలా తినాలి?

పుచ్చకాయ

వేసవి తాపం నుంచి బయటపడటానికి ఎక్కువమంది పుచ్చకాయ తింటారు. దీనిలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో అలసిపోయినప్పుడు పుచ్చకాయ తినడం వల్ల.. దీనిలో ఉండే సుక్రోజ్, గ్లూకోజ్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. దాంతో వెంటనే ఓపిక వస్తుంది. పుచ్చకాయ గొంతు తడారిపోకుండా చేస్తుంది. వడదెబ్బ బారిన పడకుండా కాపాడుతుంది. దీనిలో విటమిన్ ఏ, బీ, సీ.. పీచుపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం శాతం కూడా ఎక్కువే. కార్బొహైడ్రేట్స్ కూడా బాగానే ఉన్నాయి.

పుచ్చకాయ కడుపులో మంటను తగ్గించడమే. కాకుండా శరీరాన్ని చల్లబరుస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ జరగడానికి తోడ్పడుతుంది. వేసవిలోనే కాదు, మామూలు రోజుల్లో కూడా చర్మాన్ని రక్షించడానికి దీని గుజ్జు ఉపయోగపడుతుంది. పుచ్చకాయ తినడం వల్ల ఆస్తమా, జలుబు, అజీర్తి లాంటి రోగాలు తగ్గుతాయి. పుచ్చగింజలను రసంగా తీసుకుంటే బీపీ, మూత్ర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

రేగిపండ్లు

ఇప్పటికీ రేగిపండ్లు వేసవికాలంలో మాత్రమే దొరుకుతాయి. వీటిలో కూడా చాలా రకాలున్నాయి. వీటిని నేరుగా కాకుండా.. ఉప్పుకారం పొడితో కలిపి తింటారు. విత్తనం ఎక్కువగా, గుజ్జు తక్కువగా ఉన్నా వీటిలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా వేసవిలో వచ్చే అనేక రోగాల నుంచి రేగిపండ్లు కాపాడతాయి. వీటిలో ఉండే అనేక ఆమ్లాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తినడం వల్ల తరచూ వచ్చే జ్వరం, జలుబు లాంటివి తగ్గుముఖం పడతాయి.

ఇవి లివర్ పనితీరును, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. వీటిలో కార్బొహైడ్రేట్స్, చక్కెర, పీచుపదార్థం, ప్రొటీన్లు, క్యాల్షియం, ఇనుము, పాస్ఫరస్ ఉన్నాయి. ఇవి తినడం వల్ల గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వీటి గింజలను పొడిచేసి, నూనెలో కలుపుకుని రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.