విమానాల్లో డెలివరీ రూమ్‌‌‌‌ను ఊహించలేం

విమానాల్లో డెలివరీ రూమ్‌‌‌‌ను ఊహించలేం

న్యూఢిల్లీ: విమానంలో ఓ గైనకాలజిస్ట్ ఉంటే ఎలా ఉంటుంది? ఆకాశంలో ఫ్లయిట్ ప్రయాణిస్తున్న సమయంలోనే గర్భిణిలకు కాన్పు చేయాల్సిన పరిస్థితులు తలెత్తితే ఎలా? రీసెంట్‌‌గా ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో ఓ అద్భుతం జరిగింది. సదరు ఇండిగో విమానంలో ఒక గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ విమానం ఆకాశంలో ఉన్న సమయంలోనే సదరు గర్భిణికి డాక్టర్ అవసరం ఉందని విమాన సిబ్బంది పైలట్‌‌లకు చెప్పారు. అయితే అదే విమానంలో ప్రయాణిస్తున్న రియాద్‌‌కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నాగరాజ్‌‌తోపాటు డాక్టర్ శైలజ వల్లభననేని సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. గర్భిణికి తీవ్ర రక్త స్రావం కావడంతో బాత్‌‌రూమ్‌‌లో ఆమెకు డాక్టర్ శైలజ డెలివరీ చేశారు. బ్లీడింగ్‌‌ను నియంత్రించడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్‌‌ను వాడారు. అలాగే రెండు ఇంజెక్షన్లు ఇచ్చారు. దీంతో బ్లీడింగ్ ఆగిపోయిందని శైలజ చెప్పారు. ఇలా కేవలం విమానంలో అందుబాటులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్‌‌తోనే డెలివరీ చేయడం విశేషం.

తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో విమానాన్ని హైదరాబాద్‌‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన అవసరం లేదని పైలట్‌‌లకు ఇద్దరు డాక్టర్లు సూచించారు. ‘మేం ఎప్పుడూ విమానంలో డెలివరీలు చేయలేదు. సాధారణంగా మాతో పాటు నర్సులు ఉంటారు. ఇక్కడ మాత్రం నేనొక్కదాన్నే ఉన్నా. చాలా సవాళ్లు ఎదురైనా నేను భయపడలేదు. భయపడితే పని చేయలేం. ఆ తల్లి బిడ్డకు జన్మనిచ్చేలా చేయడంపైనే దృష్టి పెట్టా. ఎప్పుడైతే శిశువు ఏడ్చాడో అంతా సర్దుకుంటుందని భావించా. ఎయిర్ క్రాఫ్ట్‌‌లో డెలివరీ రూమ్ లాంటిది ఉండాలని ఎవరూ ఊహించరు. అందుకే నాకు తోచినట్లుగా చేశా. బెటాడిన్, స్పిరిట్, కొన్ని క్లాంప్స్ లాంటివి ఉండటం పనికొచ్చింది’ అని శైలజ పేర్కొన్నారు. విమానాల్లో ప్రయాణించే ముందు గర్భిణిలు జర్నీ చేయాలా లేదా అనేది గైనకాలజిస్ట్‌‌ల దగ్గర సూచనలు తీసుకోవాలని శైలజ అన్నారు. అదే సమయంలో విమానాల్లోని సిబ్బందికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొవాలనే దానిపై కొన్ని టెక్నిక్స్ నేర్పించాలని వివరించారు.