సైలెంట్ మోడ్! కవిత లేఖపై బీఆర్ ఎస్ నేతల మౌనం ఎందుకో!

సైలెంట్ మోడ్!  కవిత లేఖపై బీఆర్ ఎస్ నేతల మౌనం ఎందుకో!
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న కేటీఆర్, హరీశ్, కవిత
  • మాట్లాడేందుకు నిరాకరించిన కేటీఆర్
  • గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ
  • టైం వచ్చినప్పుడు అన్నీ బయటపడ్తాయని హింట్
  • అమెరికా నుంచి ఇవాళ రాత్రి హైదరాబాద్  కు
  • కవిత క్లారిటీపై గులాబీ వర్గాల్లో ఉత్కంఠ  

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ కారు  పార్టీలో కలకలం రేపుతోంది. ఎల్కతుర్తి సభపై తన అభిప్రాయాలను తెలుపుతూ కేసీఆర్ కు ఆమె లేఖ రాశారు.  మీటింగ్ లో మైనస్ పాయింట్లను, ప్లస్ పాయింట్లను ఎత్తి చూపారు. ఫీడ్‌బ్యాక్‌ పేరిట 8 అంశాలను ప్రస్తావించారు.

మీడియాలో దుమారం  రేపిన ఈ లేఖపై బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ, మాజీ మంత్రి హరీశ్ రావు గానీ స్పందించలేదు.. ఖండించలేదు. కుమారుడి గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం కోసం అమెరికా వెళ్లిన కవిత ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఆమె కూడా సోషల్ మీడయాలో యాక్టివ్ గానే ఉన్నారు. రైతుల నుంచి తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిన్న ట్వీట్ చేశారు.  

మీడియాలో వచ్చిన కథనంపై గానీ, లేఖ పై గాని ఆమె రెస్పాండ్ కాలేదు. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఇతర అంశాలపై ట్వీట్లు చేసినా కవిత లేఖ జోలికి వెళ్లలేదు.   మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. 

ALSO READ | పదవి ఉంటెనే వస్తరా.. కేసీఆర్.. శాసన సభకు రండి... మీ 40 ఏండ్ల అనుభవం చెప్పండి

సీఎం జహీరాబాద్  పర్యటన నేపథ్యంలో పలువురు రైతులను అరెస్టు  చేశారని వారిని విడుదల చేయాలని ట్వీట్ లో  పేర్కొన్నారు. కానీ కవిత అంశాన్ని ప్రస్తావించలేదు.   దీనిపై మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ స్పందిచకపోవడం గమనార్హం. బీఆర్ఎస్  నేతలు కేటీఆర్, హరీశ్ స్పందిచలేదు. ఇవాళ ఉదయం ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మీడియా ప్రతినిధి లేఖపై ప్రశ్నించగా.. ‘ మాట్లాడుత.. మాట్లాడుత బ్రదర్.. మాకు లేని హడావిడి మీకెందుకు’ అంటూ వెళ్లిపోయారు. 

కొంత కాలంగా అసంతృప్తి

ఎమ్మెల్సీ కవిత గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. మే డే సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సామాజిక తెలంగాణను సాధించుకోలేక పోయామని, పదేండ్లు అధికారంలో ఉన్నా భూమి లేని నిరుపేదలకు ఏమీ చేయలేక  పోయామని అన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల మధ్య భూముల విలువల తేడాలను ప్రస్తావించారు. ఆ తర్వాత మీడియాతో చిట్ చాట్ చేశారు.

 ‘నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయి. ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా! ఇంకా కష్టపెడతారా? అంటూ బాధ పడ్డారు. ‘నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాను. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందనుకుంటున్న’ అని కామెంట్ చేశారు. తర్వాత కూడా పార్టీలో ఎవరూ కవిత అంశాన్ని ప్రస్తావించలేదు. 

ఆమె చిట్ చాట్ చేసిన మరుసటి  రోజే హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి విభేదాలు లేవని, కేటీఆర్ కు పార్టీ  పగ్గాలు అప్పగిస్తే కలిసి పనిచేస్తానని ప్రకటించారు. మరుసటి రోజు హరీశ్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు. రెండు గంటల పాటు భేటీ జరిగింది. ఆ తర్వాత రోజు కూడా హరీశ్ ఇంటికి కేటీఆర్ వెళ్లారు. పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించిన బీఆర్ ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఈ విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. 

కవిత అమెరికాలో ఉండగా లేఖ రిలీజ్

ఎల్కతుర్తి సభపై గ్రౌండ్ రిపోర్ట్ పేరుతో కవిత కేసీఆర్ కు రాసిన లేఖ నిన్న మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఆమె అమెరికా నుంచి రావడానికి ఒక రోజు ముందు లేఖ బయటికి రావడం హాట్ టాపిక్ గా మారింది.  దీనిపై కాంగ్రెస్, బీజేపీ స్పందించాయి. బీజేపీ, బీఆర్ఎస్ దోస్తానా కవిత బయటపెట్టారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. 

తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం కవితకు ఏమొచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఇవాళ అమెరికా నుంచి సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ఎమ్మెల్సీ కవిత ఏం మట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.