
చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ పిల్లలకు గోరు ముద్దలు తినిపిస్తుంది అమ్మ. నిజంగా ఆ చందమామ మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? అది కాని పని కదా. అందుకే మనమే చంద్రుడి దగ్గరకు పోయేలా ముంబైలోని నెహ్రూ ప్లానెటోరియం ఓ సరికొత్త అవకాశం కల్పిస్తోంది. ఆగండాగండి.. అది నిజం చంద్రుడు కాదు. ప్లానెటోరియంపై ఏర్పాటు చేసిన ‘లూనార్ డోమ్’ అది. ఇస్రో చంద్రయాన్ మిషన్లను గౌరవిస్తూ ఈ లూనార్ డోమ్‌ను ఏర్పాటు చేశారు. వచ్చిపోయే జనం దాని దగ్గరకు వెళ్లి చందమామ దగ్గరకు వెళ్లొచ్చామన్న ఫీలింగ్ ఇవ్వనున్నారు. స్టార్ట్ ఇండియా ఫౌండేషన్‌తో కలిసి ఏషియన్ పెయింట్స్ ఈ డోమ్ ఏర్పాటులో పాల్పంచుకున్నాయి. ఈ డోమ్ వ్యాసం 25.6 మీటర్లుంది. రాత్రయితే చాలు అచ్చం చందమామలా ఆ డోమ్ వెలిగిపోతుంది. రాజ్‌కోట్ శరద్ ఆర్ట్‌కు చెందిన గులామ్ మహ్మద్ బుఖారి, కడారి అలామియా, మునీర్ అబ్దుల్ రషూల్ బుఖారిలు కలిసి ఈ డోమ్‌ను కట్టారు. దేశంలో కట్టిన అతిపెద్ద చందమామ బొమ్మ ఇదే కావడం విశేషం. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆ డోమ్‌ను చూసే అవకాశం కల్పిస్తున్నారు.