పైసలిస్తే జాబ్ పక్కా.. ముందే పేపర్ లీక్ చేస్తాం..

పైసలిస్తే జాబ్ పక్కా.. ముందే పేపర్ లీక్ చేస్తాం..
  • సింగరేణిలో ఫిట్టర్​ ట్రైనీ నియామకాల్లో దళారుల దందా 
  • పేపర్​ లీక్​ చేస్తామంటూ రూ. లక్షల్లో బేరాలు
  • మణుగూరులో సింగరేణి ఉద్యోగి అరెస్టు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పైసలిస్తే సింగరేణిలో జాబ్​ ఇప్పిస్తామంటూ దళారులు నిరుద్యోగులను మోసగిస్తున్నారు. ఆదివారం జరుగనున్న సింగరేణి ఫిట్టర్​ ట్రైనీ ఎగ్జామ్​పేపర్ లీక్​ చేస్తానంటూ డబ్బులు వసూలు చేస్తున్న సింగరేణి ఉద్యోగిని మణుగూరు పోలీసులు శనివారం పట్టుకున్నారు. సింగరేణిలో 128  ఫిట్టర్​ట్రైనీ పోస్టుల భర్తీకి ఆదివారం ఎగ్జామ్​ నిర్వహిస్తున్నారు. 2,681 మంది పరీక్షకు హాజరవుతున్నారు. కొత్తగూడెంలో  ఐదు సెంటర్లు ఏర్పాటు చేశారు. కొందరు దళారులు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తే ఎగ్జామ్​ పేపర్​ లీక్​ చేస్తామంటూ బేరాలకు దిగారు. శ్రీరాంపూర్​, భూపాలపల్లి, మందమర్రి, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో కొందరు నేరుగా క్యాండిడేట్ల ద్గరకు వెళ్లి మాట్లాడుతున్నారని వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సింగరేణి డైరెక్టర్​ ఎన్. బలరాం స్వయంగా ప్రకటన చేశారు.  సింగరేణి విజిలెన్స్​అధికారులు కూడా రంగంలోకి దిగారు. పేపర్​లీక్​ చేస్తామని బేరాలాడుతున్నాడన్న అనుమానంతో మణుగూరు ఓపెన్​కాస్టులో పనిచేస్తున్న ఓ జూనియర్​ అసిస్టెంట్​ను పట్టుకుని శనివారం పోలీసులకు అప్పగించారు. గతంలో కూడా సింగరేణి నిర్వహించిన ఎగ్జామ్స్​లో అక్రమాలు జరిగినందున..  ఈసారి ఎగ్జామ్​ సజావుగా సాగుతుందా అన్న  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పక్కాగా ఏర్పాట్లు
ఎగ్జామ్​లో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండాఅన్ని చర్యలు తీసుకుంటున్నాం.  స్కానర్లను  ఏర్పాటు చేశాం. సెంటర్ల వద్ద పోలీస్​ బందోబస్తు ఉంటుంది. నిరుద్యోగులు దళారులను నమ్మి మోసపోవద్దు. ఎగ్జామ్స్​ నిర్వహణ, నియామకాలు పారదర్శకంగా జరుగుతాయి. 
- ఎ. ఆనందరావు, జీఎం(పర్సనల్​), సింగరేణి కాలరీస్​ కంపెనీ