మా ఊర్లో బెల్టు షాపులు బంజేస్తరా లేదా?

మా ఊర్లో బెల్టు షాపులు బంజేస్తరా లేదా?

సార్ మా ఊర్లో బెల్టుషాపులు మూసివేయిస్తారా లేదా.... మీకు కంప్లైంట్ ఇచ్చి ఆరు నెలలవుతుంది...మీరేమి చేస్తున్నారు అంటూ ఓ యువకుడు ఎక్సైజ్ అధికారులకు చుక్కలు చూపించాడు.మీ వల్ల కాదంటే చెప్పండి నేను చూసుకుంటా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటు చేసుకుంది. సయ్యద్ పల్లికి చెందిన నవీన్ అనే యువకుడు పరిగి ఎక్సైజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.తమ గ్రామంలో 2 వేల జనాభా ఉంటుందని... ఎనిమిది జనరల్ స్టోర్స్ ఉంటాయని ...వాటన్నింటిలో మద్యం తప్ప మరేమీ అమ్మరని  యువకుడు వాపోయాడు. ఉదయం నుండే మద్యం అమ్మకాలు జోరందుకుంటాయని...ఊర్లో జరిగే ప్రతి గొడవకు బెల్టు షాపులే కారణమంటూ ...వెంటనే బెల్టుషాపుల మూసివేయించాలని జులై నెలలో ఎక్సైజ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.

అయితే ఆరోజు నుండి ఇప్పటి వరకు పలుమార్లు ఎక్సైజ్ ఆఫీసు చుట్టూ తిరిగానని యువకుడు తెలిపాడు. విసిగి వేసారిన యువకుడు నేరుగా ఎక్సైజ్ ఆఫీసుకు వెళ్ళి అధికారులను ప్రశ్నించాడు. కంప్లైంట్ ఇచ్చి ఆరు నెలలైన మీరేం చేస్తున్నారంటూ... సూటి ప్రశ్న వేశాడు. బెల్టుషాపులు మూసి వేయించకపోగా కంప్లైంట్ ఇచ్చిన తననే బెదిరిస్తారా అంటూ... వాగ్వాదం చేశాడు. మీ వల్ల కాకపోతే చెప్పండి నేను చూసుకుంటా వార్నింగ్ ఇచ్చాడు. యువకుడు అడిగిన ప్రశ్నలకు ఎక్సైజ్ అధికారులు నీళ్ళు నమలడం తప్ప మారేమి చేయలేదు.