కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  •      యువకుడు మృతి.. ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలు

మునిపల్లి, వెలుగు: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని మొగుడంపల్లి గ్రామానికి చెందిన రాజు తన స్నేహితులు జహీరాబాద్‌‌‌‌కు చెందిన బాలకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డిలతో కలిసి బుధవారం రాత్రి బయటకు వెళ్లాడు. అనంతరం గురువారం తెల్లవారుజామున జహీరాబాద్ వైపు నుంచి తిరిగి వస్తుండగా, కంకోల్ గ్రామ సమీపంలోని సర్వీస్ రోడ్డులో ప్రారంభ భాగంలో ఉన్న బ్రిడ్జి డివైడర్‌‌‌‌ను వారి బైక్‌‌‌‌ వేగంగా ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో బైక్‌‌‌‌పై ఉన్న ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న టోల్ గేట్ అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వారిని జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డిలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. మృతుడి తల్లి ఉప్పలేటి భాగ్యలక్ష్మి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు.