వీడు మామూలులోడు కాదు..90 రోజుల్లో 59 బైకులు కొట్టేశాడు

వీడు మామూలులోడు కాదు..90 రోజుల్లో 59 బైకులు కొట్టేశాడు

మెట్రో స్టేషన్లలో బైక్​లే టార్గెట్​ కొట్టేస్తడు..పార్కింగ్​లో పెడ్తడు  
90 రోజుల్లో ఏకంగా 59 బైక్లు దొంగిలించిన కేటుగాడు
ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకాలు 
నిందితుడితోపాటు ఇద్దరు రిసీవర్ల అరెస్టు

సికింద్రాబాద్, వెలుగు: జల్సాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు 90 రోజుల్లో 59 బైక్​లు కొట్టేశాడు. నిందితుడితోపాటు వీటిని కొన్న ఇద్దరు రిసీవర్లను పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేట్​ఠాణాలో డీసీపీ సాధనా రష్మి పెరుమాళ్, అడిషనల్ డీసీపీ పగడాల అశోక్​కలిసి బుధవారం కేసు వివరాలు తెలిపారు. 

కొత్త గూడెం జిల్లా  పాల్వంచకు చెందిన చైతన్య సాయి కుమార్(33) 2013లో డిప్లొమా పూర్తి చేశాడు. తర్వాత సిటీలోని పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేశాడు. అప్పటికే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. జల్సాలకు కావాల్సిన డబ్బులు ఈజీగా సంపాదించేందుకు  బైక్ దొంగతనాలు చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. 

రెక్కీ చేసి.. మారు తాళం పెట్టి

మెట్రో, రైల్వే, బస్టాప్ పార్కింగ్ ప్రాంతాలను ఎంచుకొని తొలుత రెక్కీ చేసేవాడు. పార్క్ చేసిన బైక్​లను మారు తాళంతో  తీసి దర్జాగా నడుపుకుంటూ పోయేవాడు. ఇలా ప్యారడైజ్, ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్​పల్లి, మియాపూర్, బాలానగర్, నాగోల్ మెట్రో స్టేషన్లలో పార్క్ చేసిన బైక్​లను దొంగిలించాడు. కొద్దిరోజులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్ బస్టాప్​లో పార్క్​ చేసి చార్జీలు చెల్లించాడు.

ఫేక్ ఆర్సీలు సృష్టించి తక్కువ ధరకు అమ్మాలని చూశాడు. వర్కవుట్​ కాకపోవడంతో తనకు పరిచయమున్న కొత్తగూడెం జిల్లా గండుగులపల్లికి చెందిన మధ్యానపు జగదీశ్(28), ఘట్​కేసర్​లో ఉంటున్న ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కుంచాల హరికృష్ణ(25)ను సంప్రదించాడు. వారితో కలిసి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నాడు.  

సీసీ ఫుటేజీల్లో చిక్కాడు

మెట్రో స్టేషన్​లో పార్క్ చేసిన బైక్​లు చోరీకి గురైనట్లు ఫిర్యాదు రావడంతో బేగంపేట పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. వీటి ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకున్నాడు. అతడి సమాచారంతో రిసీవర్లు జగదీశ్, హరికృష్ణ వద్ద 59 బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. 

వీటి విలువ రూ.42 లక్షల వరకు ఉంటుందని డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు. బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ మూర్తి, బేగంపేట సీఐ రామయ్య పాల్గొన్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన  క్రైమ్ టీం సభ్యులకు రివార్డులను అందజేశారు.