రాత్రంతా బాలుడు ఏడుస్తూ బాబాయ్‌ మృతదేహంపైనే

రాత్రంతా బాలుడు ఏడుస్తూ బాబాయ్‌ మృతదేహంపైనే

గజ్వేల్‌: మరికొద్దిసేపట్లో మామయ్య, అత్తమ్మ ఇంటికెళ్లి ఆడుకోవచ్చంటూ ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ తీసుకెళ్తున్న బాబాయ్ కి ఏమైందో తెలియదు.చీకట్లో రోడ్డుపక్కన పడిపోయాడు.ఎంత పిలిచినా పలకడం లేదు.దీంతో చిన్నారి ఏడుస్తూ బాబాయ్ శరీరంపైనే తల ఆనించి నిద్రపోయాడు. తెల్లారాక పొలం పనులకు వెళ్తున్న వారు గమనించే వరకు బాబాయ్ శవం పైనే నిద్రపోతూ కనిపించాడు. కళ్లు తెరచి చూస్తే.. బాబాయ్ పలకడం లేదు.. ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు. చుట్టూ చేరిన కొత్తవాళ్లు.. తనను ఓదారుస్తుంటే పసికందు బాబాయ్ కావాలంటే గుక్కపట్టి ఏడ్వడం కంటతడిపెట్టించాయి. సిద్దపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ వద్ద జరిగిందీ విషాద ఘటన.

తనతో కబుర్లు చెబుతూ బండి మీద అత్తమ్మ వద్దకు తీసుకెళ్తానని బయలుదేరిన బాబాయ్ రోడ్డు ప్రమాదంలో బాబాయ్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలియని ఆ పసివాడు.. అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఏడు గంటలపాటు మృతదేహంపైనే నిద్రపోయాడన్న విషయం స్థానికుల్లో విషాదం రేపింది. విషయం తెలిసిన వెంటనే స్థానిక సర్పంచ్ భాను ప్రకాశరావు బాలుడిని గజ్వేల్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. చనిపోయిన వ్యక్తి  మర్కూక్‌ మండలం నర్సన్నపేటకి చెందిన ఎక్కలదేవి ఐలయ్య(28)గా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 

అసలేం జరిగిందంటే... ఐలయ్య(28) తన అన్న కొడుకు నాలుగేళ్ల మోక్షిత్ ను తీసుకుని జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని తన బావ వద్దకు నిన్న రాత్రి బయలుదేరాడు. అన్న కొడుకు మోక్షిత్‌ (4)ను బైక్‌పై ఎక్కించుకొని కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. బైకు రాంనగర్‌  సమీపంలోకి రాగానే  రోడ్డుపై వేసిన ధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో వాటిపై నుంచి దూసుకెళ్లగా అదుపుతప్పి రోడ్డుపై ఎగిరిపడ్డారు.
ధాన్యం రాశులుగా కవరు కప్పి ఉండడంతో చీకట్లో కనిపించలేదని తెలుస్తోంది. ఓ కుప్పను బైకు ఢీకొట్టడంతో ఎగిరి ఇద్దరూ రోడ్డు పైనే కింద పడిపోయారు. ఐలయ్య తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో స్పహతప్పి పడిపోయి చనిపోయాడు.

రాత్రి 10 గంటల సమయంలో.. అందునా లాక్ డౌన్ కర్ఫ్యూ వల్ల అటువైపు ఎలాంటి రాకపోకలు లేవు. తనను అనుక్షణం పిలుస్తూ నవ్వించే బాబాయ్ మాట్లాకుండా పడిఉన్నాడు.. చీకట్లో ఏం జరిగిందో తెలియదు.. గాయాలతో నొప్పిగా ఉండడంతో ఏడుస్తూ..బాబాయ్‌ మృతదేహంపైనే తల ఆనించి పడుకుండిపోయాడు. ఆదివారం తెల్లవారజామున పొలం పనుల కోసం వెళ్తున్న ఓ రైతు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు వచ్చి చూసేసరికి బాలుడు బాబాయ్‌ మృతదేహంపై తలపెట్టి పడుకుని ఉన్న బాలుడు నిద్ర మేల్కొని ఏడ్పు మొదలుపెట్టడం అందర్నీ కంటతడిపెట్టించింది. సర్పంచ్‌ భానుప్రకాశ్‌రావు బాలుడిని గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించి గాయాలకు ప్రాథమిక చికిత్స చేయించి వారి కుటుంబ సభ్యులు వచ్చే వరకు ఉండి అప్పగించారు.